తెలంగాణ వాదం మళ్లీ ఊపిరి పోసుకుంటుందా..? ఆంధ్ర, తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. చివరికి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఇదంతా 12 ఏళ్ల క్రితం కథ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే మూడు ఎన్నికలు జరిగిపోయాయి. ఉమ్మడి రాజధాని అనే శకం కూడా ముగిసింది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు.. అనేది హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ప్రస్తుత రచ్చకు ఒకే ఒక్క కారణం.. అధికారం మాత్రమే అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతున్నాడు. అధికారంలో ఉన్న 2014-23 మధ్య కాలంలో తెలంగాణ వాదం అనేది అస్సలు గుర్తుకు రాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నా ప్రాంతం అంటూ కబుర్లు చెబుతున్నారు.
Also Read : ఎండాకాలంలో కోడిగుడ్లు తినవచ్చా..?
ప్రత్యేక తెలంగాణ రాక ముందు ఆంధ్ర ప్రాంతం వారిని తరిమి కొడతామని భయపెట్టారు నాటి తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతా అన్నదమ్ములే.. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు.. ఆంధ్ర వాళ్లే కాదు.. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ బతికేందుకు సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇది అందరి రాష్ట్రం.. అని మాయ మాటలుు చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి మాకు అన్యాయం జరుగుతోంది.. మా మీద పెత్తనం చేస్తున్నారు.. మా వాళ్లను కించపరుస్తున్నారు.. అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇందుకు ప్రధానంగా కనిపిస్తున్న కారణం.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్ మైత్రివనం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నిజానికి ఎన్‌టీఆర్‌ను ఒక ప్రాంతానికే పరిమితం చేయడం అనేది హాస్యాస్పదం. రాజకీయాల్లోకి రాకముందే ఎన్‌టీఆర్‌ను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని దర్శక రత్న దాసరి నారాయణ రావు అభివర్ణించారు. ప్రాంతాలు, కుల, మతాలు, వయోభేదం లేకుండా ఎన్‌టీఆర్‌కు అభిమానులున్నారు. అలాగే ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క ప్రాంతాన్ని వేరు భావనతో చూడలేదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అంటూ విభజించలేదు. అందరూ తెలుగు వాళ్లే అని బలంగా చాటి చెప్పారు. తెలంగాణలో దొరల పెత్తనం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ చతురత చూసిన గులాబీ శ్రేణుల్లో కలవరం మొదలైందనే మాట బాగా వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజానికి ఎన్‌టీఆర్ విగ్రహం ఇదే మొదటిది కాదు. ఇప్పటికే కొన్ని లక్షలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ హైదరాబాద్ అమీర్‌పేటలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. దానిని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు. ఇదే ఇక్కడ హాట్ టాపిక్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ను మించిన స్థాయిలో ఈ ఈవెంట్ జరగడంతో ఎన్టీఆర్ అభిమానుల హృదయాలను రేవంత్ రెడ్డి కొల్లగొట్టారు.
Also Read : లోకేష్-రాబిన్ ఖుదా భేటీ.. విశాఖకు బిగ్ బూస్ట్!
సరిగ్గా ఎన్‌టీఆర్ జయంతి రోజున.. భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరించడంతో పాటు.. ఆ తర్వాత నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌టీఆర్ తెలంగాణకు చేసిన మేలు.. ఆయన వల్ల రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వచ్చిన వారి వివరాలు వెల్లడించారు. ఇక మహానాడును మించిన కార్యక్రమంగా ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం కావడంతో స్వయంగా టీడీపీ శ్రేణులే రేవంత్ రెడ్డి జపం చేస్తుండటం ఆయన రాజకీయ చతురత ఎంతలా పెరిగిందో స్పష్టం చేస్తోంది. మరోవైపు, రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ అనూహ్య రాజకీయ ఎత్తుగడలను చూసి గులాబీ వర్గాలు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నాయి.
భారీ ఎత్తున జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేకపోతున్న పింక్ శ్రేణులు.. రేవంత్ వ్యూహాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక అతలాకుతలం అవుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో మరోసారి ప్రాంతీయ చిచ్చు పెట్టేందుకు గులాబీ శ్రేణులు మరోసారి కుట్రలు చేస్తున్నాయి. మిలిటెంట్ ఉద్యమం అని ఒకరంటే.. ఆంధ్ర నేతల విగ్రహాలు కూల్చేస్తామని మరొకరు అంటున్నారు. కొంతమంది అయితే.. మళ్లీ మాపై మీ పెత్తనమా.. అంటూ సాధ్యం కానీ మాటలు చెబుతున్నారు. అందుకే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మేధావుల ముసుగులో కొందరు నానా పాట్లు పడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ పరిణామాలతో టీడీపీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

