ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ భాగస్వామ్యంతో ఏపీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి సర్కార్ పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ఏపీలో పలు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఏపీలోని దేవరపల్లి నుంచి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే సిద్ధమైంది. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ పైన వాహనాలు పరుగులు పెడుతున్నాయి. నాయుడుపేట – తిరుపతి – చిత్తూరు – బెంగళూరు మార్గం సిద్ధమైంది. త్వరలో అమరావతి – కడప – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే కూడా రెడీ అవుతోంది. తాజాగా మరో అంతర్రాష్ట్ర గ్రీన్ ఫీల్డ్ హైవే కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read : బెంబేలెత్తిస్తున్న ఎబోలా.. హైఅలర్ట్..!
సరకు రవాణా వేగంగా సాగేలా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు హైస్పీడ్ రోడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ మార్గం ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా వెళ్లనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ.. మోర్త్.. మొత్తం మూడు ఆప్షన్లను సూచించింది. అందులో ఏజెన్సీ ప్రాంతాన్ని ఎక్కువగా కవర్ చేసేలా ఉన్న ఎలైన్‌మెంట్‌కు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. ఈ 4 వరుసల కారిడారు ఆనుకుని అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఎన్‌హెచ్-516కి సమాంతరంగా.. మోర్త్ సూచించిన ఆప్షన్ 1: కోల్ కతా – చెన్నై మధ్య ప్రస్తుతమున్న ఎన్‌హెచ్-16లో ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వరకు హైవేను హైస్పీడ్ కారిడార్‌గా మార్చేలా సూచించారు. ఆప్షన్ 2: ఇందులో పశ్చిమబెంగాల్, ఒడిశాలోని బహరగోరా, ఝార్ఖండ్, భంజనగర్, కామాఖ్యనగర్, పద్మాపూర్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాడేరు, చింతపల్లి, గోకవరం, మక్కువ, అరకు, కన్నాపురం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, నూజివీడు మీదుగా ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో కలుస్తుంది. ఆప్షన్ 3: ఖరగ్‌పూర్ నుంచి పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా మీదుగా వచ్చి ఏపీ సరిహద్దులో కుంట మీదుగా చింతూరు, చింతలపూడి, కుకునూరు, విస్సన్నపేట మీదుగా మైలవరం సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కలిసేలా ప్రతిపాదించారు.
Also Read : కష్టపడిన వారికి గుర్తింపు కష్టమేనా..?
ఇందులో రెండో ఆప్షన్ ఎలైన్‌మెంట్‌కు రాష్ట్రప్రభుత్వం సమ్మతి తెలిపింది. ఇది విజయనగరం – రాజమహేంద్రవరం మధ్య ఏజెన్సీ ప్రాంతాల మీదుగా విస్తరణ పనులు జరుగుతున్న ‘ఎన్‌హెచ్-516ఇ’కి అనేక చోట్ల సమాంతరంగా వెళ్తుంది. ప్రాజెక్టు రూ.75,629 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపిన మార్గం మొత్తం 1,107 కిలోమీటర్లు. పశ్చిమబెంగాల్లో 65 కిలోమీటర్లు, ఝార్ఖండ్‌లో 63, ఒడిశాలో 522, ఏపీలో 457 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందులో 1,057 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 202 కిలోమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 116 కిలోమీటర్లు, ఏలూరు జిల్లాలో 111 కిలోమీటర్లు, తూర్పుగోదావరి జిల్లాలో 28 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కారిడార్ ప్రస్తుతమున్న కోల్ కతా – చెన్నై హైవేకు గరిష్ఠంగా 120 కిలోమీటర్లు, కనిష్ఠంగా 20 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. అలాగే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా దీన్ని నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు రూ.75,629 కోట్లు అవుతుందని అంచనా ఉంది.

