అధికారం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. రాజకీయాల్లో మాకు తిరుగే లేదని కాలర్ ఎగరేసిన నేతలు.. ఒక్క ఓటమితోనే బొక్క బోర్లా పడినట్లు అయ్యింది. పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో మళ్లీ గెలుపు కష్టమే అనే భయం పట్టుకున్నట్లు అయ్యింది పరిస్థితి. చివరికి ఓటమి తర్వాత ప్రజల్లోకి వచ్చేందుకు కూడా ముఖం చెల్లటం లేదు. దీంతో రాజకీయ జీవితం ముగిసినట్లే అనే ప్రచారం మొదలైంది. దీంతో అటు పార్టీని కాపాడుకునేందుకు, ఇటు అధికారంలోకి వచ్చేందుకు రహస్య మంతనాలు చేస్తున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా జరుగుతోంది.
Also Read : కులగణ జరగాల్సిందే.. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..!
ಒక తాజా ముఖ్యమంత్రితో చేతులు కలిపి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ రాజకీయ పునరుత్తేజం పొందాలని చూస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఏకంగా సౌత్ రీజనల్ రెలీజియన్ ఫ్రంట్‌కి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే మాట కూడా వస్తోంది. ఆ పార్టీలు బీఆర్ఎస్, వైసీపీ, టీవీకే అయితే అధినాయకులు కేసీఆర్, జగన్, విజయ్ అని అంటున్నారు. కేసీఆర్ రెండుసార్లు తెలంగాణాకు సీఎంగా చేసి ఓడిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా రెండేళ్ళుగా మాజీ సీఎంగా ఉన్నారు. ఇక రెండేళ్ళ క్రితం పార్టీ పెట్టిన విజయ్.. తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఇపుడు కేసీఆర్, జగన్ భవిష్యత్తు రాజకీయాలకు జగన్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారని అంటున్నారు.
తెలుగు రాజకీయాల్లో కొత్త సమీకరణలకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన దారి తీసిందనేది వాస్తవం. ఒక విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ ఇళ్లకు వెళ్లడంతో ఎన్డీయే బంధం మరింత పటిష్టం అయిందని తేలిపోయింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు 2029 ఎన్నికల్లో కూడా కలసికట్టుగానే పోటీ చేస్తాయనే విషయం స్పష్టం అవుతోంది. అంతే కాదు మోడీ, బాబు, పవన్‌ల మధ్య మిత్రబంధం మరింత బలంగా మారింది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బీఆర్ఎస్‌తో బీజేపీ కలుస్తుందన్న ప్రచారం పూర్తిగా పక్కకు పోయింది. అలాగే ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య రహస్య స్నేహ బంధం కూడా తెగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయేకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వైసీపీకి అనివార్యంగా కనిపిస్తోంది. ఇంత జరిగిన తరువాత కూడా ఎన్డీయేకు మద్దతు పరోక్షంగా అయినా ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వస్తాయనేది వైసీపీ నేతల మాట.మరోవైపు వైసీపీకి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా రివర్స్ అవుతుందన్న చర్చ కూడా ఉంది. ఇక ఏపీలో 2029 ఎన్నికల్లో బాబు, పవన్, మోడీ త్రిమూర్తులను వైసీపీ అధినేత జగన్ మరోసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. దాంతో వైసీపీ ఇక మూడేళ్ళు ముందుగానే తన రాజకీయ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు.
Also Read : బెంగాల్‌లో బుల్‌డోజర్లు.. సువేందు భారీ ఆపరేషన్..!
తెలంగాణాలో కేసీఆర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. దాంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో నేరుగా చేతులు కలపలేని పరిస్థితి ఉంది. అలాగని బీజేపీతో కలసి ముందుకు సాగితే బీఆర్ఎస్ మనుగడకే కష్టం అవుతుంది. బీజేపీతో బాహాటంగా కలిస్తే మైనారిటీ ఓట్లు ఇతర అణగారిన వర్గాల ఓట్లు పోతాయన్న భయం ఉంది. అయితే బీజేపీ పట్ల ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్‌తో అయితే బీఆర్ఎస్ ఉందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ వర్గాలు ఇంతకాలం చేస్తూ వచ్చాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం మోడీ, బాబు, పవన్ తెలంగాణాలో కూడా ఎన్డీయేగా ముందుకు వస్తే మాత్రం బీఆర్ఎస్ కొత్త ఆలోచనలు చేయాల్సిందే అన్నది కూడా గులాబీ పార్టీలో ఉంది.
ఇదిలా ఉంటే జాతీయస్థాయిలో ఇండియా కూటమి వైపు కేసీఆర్, జగన్ చూపు పడుతుందా అనే చర్చ కూడా ఉంది. ఎంత లేదనుకున్నా జాతీయ రాజకీయాన్ని కూడా గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ప్రాంతీయ పార్టీలకు ఉంది. అంతే కాదు తెలంగాణాలో ఏకంగా మోడీయే రంగంలోకి దిగితే ప్రాంతీయ పార్టీలతో అయినా చెలిమి చేయడం ద్వారా బలం పెంచుకోవాలన్నది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దాంతోనే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్‌తో స్నేహం విషయంలో బీఆర్ఎస్ ఉత్సాహం చూపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా విజయ్‌తో సన్నిహితంగా మెలిగేందుకు చూస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు కీలక పార్టీలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త రూట్‌లోకి వెళ్తున్నాయాన్న చర్చ సాగుతోంది.
Also Read : బెజవాడ రైళ్లు అన్నీ పారిపోతున్నాయి..!
అయితే ఈ ముగ్గురు నాయకులు తమ ప్రభావాన్ని రాజకీయంగా దక్షిణాదిన చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం ప్రాంతీయ కూటమిని కట్టాలని కూడా వ్యూహ రచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అవినీతి ఆరోపణలు ఒకవైపు.. మరో వైపు మత రాజకీయాలను ముందుకు తీసుకుని రావడం వంటివే అడ్డంకిగా మారుతాయన్న చర్చ సాగుతోంది. అయితే దక్షిణాదిన ఎన్డీయే కూటమిని మరీ ముఖ్యంగా చంద్రబాబును ఎదుర్కోవడమే ఈ ఇద్దరు నేతల ప్రధాన లక్ష్యం. మరి వీరి ఆశలు ఏ మేరకు సఫలం అవుతాయన్నది తెలియాలన్నా అనేక ప్రశ్నలకు జవాబు దొరకాలన్నాకొంత కాలం పాటు వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ సారధ్యం కాకుండా మమతా బెనర్జీ లాంటి వారు పగ్గాలు అందుకుంటే తెలుగు నాట కూడా కొత్త పార్టీలు అందులో చేరేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఎన్డీయే తెలుగు రాష్ట్రాలలో బలంగా ఉండాలని మోడీ నిర్ణయించిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ రెండూ అలెర్ట్ అయినట్లుగా కనిపిస్తోందనే విషయం తేలిపోయింది.

