పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్నట్లుగా ఉంది విజయవాడ రైల్వే డివిజన్ పరిస్థితి. పేరుకే్ పెద్ద డివిజన్.. కానీ ఇక్కడి నుంచి పట్టుమని పది రైళ్లు కూడా ప్రారంభం కావటం లేదు. ఇదేమంటే.. ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు. ఒకరు ప్లాట్ఫారం ఖాళీ లేదంటుుంటే.. మరొకరేమో.. మెయింటనెన్స్ ఇబ్బందులు అంటున్నారు. చివరికి అంతా కలిసి విజయవాడ నుంచి ప్రకటించిన అన్ని రైళ్లను.. ఒక్కొక్కటిగా తమ తమ ఊర్లకు పొడిగించుకుంటున్నారనే మాట కంటే కూడా.. లాక్కెళ్లిపోతున్నారంటే చాలా బాగుంటుంది. అయినా సరే.. విజయవాడ ప్రజా ప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
Also Read : దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయవాడ డివిజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. చెన్నై – కొల్ కతా – ఢిల్లీ – ముంబై మార్గాలను కలిపే ప్రధాన రైల్వే జంక్షన్. నిత్యం లక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారు. వేల సంఖ్యలో రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఉన్న పది ప్లాట్ఫామ్ల్లో నిరంతరం ఏదో ఒక రైలు కనిపిస్తూనే ఉంటుంది. గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాజీపేట, గుడివాడ వైపు వెళ్లేందుకు ఇదే జంక్షన్. నిత్యం రద్దీగా ఉండే బెజవాడ రైల్వే స్టేషన్ నుంచి పట్టుమని పది రైళ్లు కూడా ప్రారంభం కాకపోవడం ఇప్పుడు విజయవాడ వాసులను కలవరపెడుతోంది. ఒకటో రెండో రైళ్లు కేటాయించినప్పటికీ.. అవి కూడా వెంటనే పక్కనే ఉన్న స్టేషన్లకు పొడిగిస్తున్నారు. దీంతో విజయవాడ వాసులకు సరైన రవాణా సౌకర్యం లేకుండా పోతుంది.
విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం పినాకిని, రత్నాచల్, శాతవాహన రైళ్లు ప్రారంభమవుతాయి. అంతే.. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే రైలు ఒక్కటి కూడా కనిపించదు. ఏదో ఒకటి అరా ఎక్స్‌ప్రెస్‌లు తప్ప.. మిగిలినవన్నీ కూడా ప్యాసింజర్ రైళ్లు మాత్రమే. గతంలో విజయవాడ నుంచి ప్రారంభమయ్యే చెన్నై వందేభారత్, హుబ్లీ అమరావతి, ధర్మవరం, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లను సైలెంట్‌గా పొడిగించారు. చెన్నై వందేభారత్, హుబ్లీ అమరావతి నరసాపురం వరకు వెళ్లిపోయాయి. ధర్మవరం ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం వరకు పోతుంది. విశాఖ – విజయవాడ మధ్య తిరిగే జన్మభూమి ఇప్పుడు సికింద్రాబాద్ వరకు పోతుంది. దీంతో విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్లాలంటే.. పై నుంచి వచ్చే రైళ్ల కోసం ఎదురు చూడాల్సిందే. తాజాగా విజయవాడ నుంచి తిరువణ్ణమలై, బెంగళూరు వరకు ప్రకటించిన వీక్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఇప్పుడు నరసాపురం వెళ్లిపోయాయి.
నిజానికి ఇది స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్థత అంటున్నారు రైల్వే ప్రయాణీకుల సంఘం సభ్యులు. విజయవాడ – కర్నూలు, విజయవాడ – తిరుపతి మధ్య ఇంటర్ సిటీ రైలు కావాలనేది ఎప్పటి నుంచే వినిపిస్తున్న డిమాండ్. ఉదయం ఈ మార్గాల్లో సరైన రైలు సౌకర్యం లేదు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాలంటే.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ మాత్రమే దిక్కు అంటున్నారు. ఇది విజయవాడ నుంచి సికింద్రాబాద్, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ఆదిలాబాద్ వరకు పొడిగించారు. దగీంతో ఇందులో సీటు దొరకడం చాలా కష్టం. అందుకే ప్రతి రోజు ఉదయం పూట కర్నూలు, తిరుపతి వరకు ఇంటర్సిటీ రైలు నడిపించాలనేది ప్రధాన డిమాండ్.
Also Read : టీ బీజేపీలో భారీ మార్పు.. రంగంలోకి ఈటల..!
అలాగే విజయవాడ నుంచి నిత్యం వేల మంది బెంగళూరు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఒక్క రైలు కూడా విజయవాడ నుంచి ప్రారంభం అవ్వదు. దీంతో తప్పని పరిస్థితుల్లో బస్సుల వైపు చూడాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రైల్వే శాఖకు ఓ ప్రతిపాదన చేశారు. విజయవాడ నుంచి బెంగళూరు వరకు మార్కాపురం, నంద్యాల మీదుగా వందేభారత్ స్లీపర్ నడిపించాలని కోరారు. నిజానికి ఇలాంటి ప్రతిపాదన విజయవాడ ప్రజాప్రతినిధులు చేయాల్సి ఉంది. కానీ వాళ్లకు ఇప్పటికీ అలాంటి ఆలోచన రాలేదు. ఇక విజయవాడ నుంచి రైలు ప్రకటించడం ఆలస్యం.. దానిని నరసాపురం వరకు.. అంటున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. విజయవాడ రైల్వేస్టేషన్లో రద్దీ అంటున్నారు.. మరి నరసాపురంలో ఆ రద్దీ ఉండదా.. అనేది ఇప్పుడు సగటు రైల్వే ప్రయాణీకుల ప్రశ్న. ఇప్పటి కైనా విజయవాడ ప్రజా ప్రతినిధులు మేల్కోని.. బెజవాడ వాసులకు సరైన రైలు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

