దేవినేని ఉమామహేశ్వర్రావు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. అన్న చాటు వ్యక్తిగా ఉన్న ఉమా.. మంత్రి వెంకటరమణ దుర్మరణంతో ఒక్కసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన దేవినేని ఉమా.. 2009, 2014లో మైలవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014 చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేందుకు దేవినేని ఉమా కృషి స్పష్టంగా ఉంది. అందుకే 2019 ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేశామని చంద్రబాబు ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేశారు కూడా.
Also Read : జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?
ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. దూకుడుగా వ్యవహరించే దేవినేని ఉమాను అడ్డుకునేందుకు నాటి కాంగ్రెస్ పెద్దలు, ప్రస్తుతం వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నం చేశాయి. నియోజకవర్గం మారినా కూడా వరుసగా రెండుసార్లు గెలిచారు దేవినేని ఉమా. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కూడా కీలక నేతగా వ్యవహరించారు. ఒకదశలో కృష్ణా జిల్లా టీడీపీ అనగానే దేవినేని ఉమామహేశ్వర్రావు మాత్రమే గుర్తుకు వచ్చేలా పరిస్థితి మారిపోయింది. పొలిట్‌బ్యూరో సభ్యునిగా కూడా వ్యవహరించారు. అలాగే పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా దేవినేని ఉమా భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండేది. అది పార్టీ పండుగ మహానాడు అయినా సరే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, ఆందోళనలు అయినా సరే.. ఉమా పేరు లేని కమిటీ ఉండేది కాదంటే.. అతిశయోక్తి కాదు.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ఉమా ప్రస్తుత పరిస్థితి తారుమారైంది. గతంలో ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమా.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. అసలు దేవినేని ఉమా పార్టీ పెద్దలకు గుర్తున్నారా.. లేరా.. అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్ సర్కార్‌పై దేవినేని ఉమా ప్రత్యక్ష పోరాటం చేశారు. నాటి మైలవరం వైసీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టారు. ప్రజా సమస్యలను ప్రస్తావించారు. చివరికి దాడులకు కూడా గురయ్యారు. దేవినేని ఉమా పైన గత ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు కూడా పంపింది. అయినా సరే.. తన వాయిస్ ఎక్కడా తగ్గించలేదు.
అలాంటి దేవినేని ఉమామహశ్వర్రావు ప్రస్తుతం కనుమరుగయ్యారనే చెప్పాలి. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. దీంతో ఆయనకు మైలవరం టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో వసంతతో కలిసి పనిచేయాలని.. ఆ తర్వాత తగిన గౌరవం వస్తుందని దేవినేనికి చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండేళ్లు కావొస్తున్నా సరే.. ఇప్పటి వరకు దేవినేని ఉమాకు సరైన గౌరవం దక్కలేదనే చెప్పాలి. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఇక రాజ్యసభ సభ్యునిగా దేవినేని పేరు పరిశీలిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది.
Also Read : ఆపరేషన్ ఆకర్ష్.. మోదీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
పది రోజుల క్రితం విడుదలైన పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ కమిటీలో దేవినేని ఉమా పేరు కనిపించలేదు. పొలిట్‌బ్యూరో సభ్యునిగా చేసిన వ్యక్తికి కనీసం రాష్ట్ర పార్టీ కార్యదర్శి పదవి కూడా రాలేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ షాక్ నుంచి దేవినేని అభిమానులు తేరుకోక ముందే.. టీడీపీ అధిష్ఠానం మరో బాంబు పేల్చింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన మహానాడు కమిటీలో కనీసం ఒక్కచోట కూడా దేవినేని ఉమామహేశ్రర్రావు అనే పేరు లేదు. గతంలో ఆహ్వాన కమిటీ, తీర్మానాల కమిటీ, సభా నిర్వహణ కమిటీ వంటి కీలకమైన కమిటీలకు సారధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వర్రావు పేరు ప్రస్తుతం ఏ ఒక్క కమిటీలో కూడా కనిపించలేదు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కనీసం ఓ ఒక్క విషయంలో కూడా దేవినేని ఉమా పేరును టీడీపీ నేతలు ప్రస్తావించటం లేదు. అసలు ఉమా అనే వ్యక్తి టీడీపీలో ఉన్నారా.. లేరా అనే అనుమానం పార్టీ నేతలకు వస్తోంది.
ఎంతో మంది సీనియర్లకు గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోయినా కూడా.. వారికి పార్టీ పదవులు కేటాయించారు. ఇక అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వంటి నేతలకు అటు మంత్రివర్గంలో, ఇటు పొలిట్‌బ్యూరోలో అవకాశం కల్పించారు. కానీ ఈ ఇద్దరి కంటే సీనియర్ అయిన దేవినేని ఉమా మహేశ్వర్రావును మాత్రం పార్టీ పెద్దలు పూర్తిగా పక్కన పెట్టడం ఇటు కృష్ణా జిల్లా నేతలతో పాటు దేవినేని అభిమానులకు కూడా షాకింగ్ న్యూస్. భవిష్యత్తులో అయినా దేవినేని ఉమామహేశ్వర్రావుకు మంచి అవకాశం వస్తుందా.. పార్టీ పెద్దలు సముచిత స్థానం ఇస్తారో లేదో వేచి చూడాలి.

