ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఇప్పటికే పరిపాలనలో ప్రభుత్వం పరుగులు పెడుతోంది. అదే సమయంలో విపక్ష వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కూడా గట్టిగానే బదులిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది కూడా. ఇటు పెట్టుబడులు రాబట్టడంలో కూడా ప్రభుత్వం విజయం సాధిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని తరచూ ఇబ్బందులు పెడుతున్న విభాగాలను కూడా ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు మెగా ప్లాన్ వేస్తున్నారు.
Also Read : వైసీపీలో చెవిరెడ్డి శకం ముగిసినట్లే..? లిక్కర్ కేసు తర్వాత మారిన సీన్..!
ఏపీలో కూటమి సర్కార్‌ను వైసీపీ నేతలు ఒక విషయంలో బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు వైసీపీ నేతలు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, దర్శనం టికెట్ల కుంభకోణం సహా టీటీడీ నిధులను పక్కదారి పట్టించడం, తిరుమల శ్రీవారి పవిత్రత దెబ్బ తినేలా వైసీపీ పాలన సాగిందనేది కూటమి నేతల ఆరోపణ. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది కూడా. కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు అరెస్టు కూడా చేశారు. ఈ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు టార్గెట్ టీటీడీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు.
ముఖ్యంగా ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల సమయంలో జరిగిన తొక్కిసలాట మొదలు.. ప్రతి విషయంలో కూడా బీఆర్ నాయుడు విఫలం అనేలా ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో సౌకర్యాల కల్పనలో విఫలమని వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా బీఆర్ నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం ఏమిటని పదే పదే విమర్శలు చేస్తున్నారు కూడా. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి వారిని ఎందుకు కొనసాగిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు.
తాజాగా తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి టీటీడీ ఛైర్మన్ దూరంగా ఉన్నారు. అలాగే సీఎం పర్యటనలో కూడా బీఆర్ నాయుడు దూరంగా ఉన్నారని.. వీడియోల నేపథ్యంలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారని వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది కూడా. అయితే దీనికి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదే సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నబీఆర్ నాయుడును తప్పిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం టీడీపీ నేతల్లో బాగా వినిపిస్తోంది. వాస్తవానికి టీటీడీ పాలకమండలి పదవీ కావలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. అలా తీసుకుంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బీఆర్ నాయుడుకు అవకాశం ఉంది. కానీ ఈలోపే నాయుడు పై వేటు ఖాయమంటున్నారు టీడీపీ నేతలు.
Also Read : లిపోప్రొటీన్ ఏ.. ఫిట్‌గా ఉన్నవారికి కూడా గుండెపోటు ప్రమాదం..!
బీఆర్ నాయుడు స్థానంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అవుతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. గతంలో కూడా కళా వెంకట్రావు టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన హోమ్ శాఖ, మునిసిపల్, రెవెన్యూ వంటీ కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. రాజ్యసభ సభ్యులుగా, 2014లో ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే మాట బాగా వినిపిస్తోంది. కళా వెంకట్రావుకు ఛైర్మన్ పదవి ఇస్తే.. అటు సొంత పార్టీతో పాటు కూటమి నేతలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తారు. వైసీపీ నేతల నోటికి కూడా తాళం పడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒంటిమిట్ల శ్రీ కోదండ రాముల వారి కళ్యాణం అనంతరం టీటీడీలో మార్పులు ఖాయమంటున్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు.

