ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీల్లో చాలా వరకు అమలు కాలేదు. ఇందుకు 2019-24 మధ్య ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏపీకి ఏం కావాలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేక పోయింది. దీంతో కీలక ప్రాజెక్టులకు బ్రేకులు పడ్డాయి. అయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కేంద్ర ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి.
Also Read : అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!
ఏపీ అంటే ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలను కలిపేలా విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. అదే సమయంలో విభజన హామీల్లో ప్రధానమైన విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ పనులు ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనులు కూడా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో కేవలం 3 ప్రధాన మార్గాల్లో మాత్రమే రైల్వే లైను అందుబాటులో ఉంది. శ్రీకాకుళం – విజయవాడ, గుంటూరు – గుంతకల్, విజయవాడ- గూడూరు మార్గాల్లో మాత్రమే ఏపీలో రైళ్లు నడుస్తున్నాయి. చెన్నై – కోల్‌కతా మార్గంలో భాగంగా గూడూరు – శ్రీకాకుళం రైల్వే లైను ఉంది. ఈ మార్గం ఏపీలో అత్యంత రద్దీగా ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒక రైలు నడుస్తున్నప్పటికీ.. ప్రయాణీకుల రద్దీకి తగినట్లుగా లేవు.
ఏపీలో ప్రస్తుతం శ్రీకాకుళం – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే సమయంలో ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా కోస్తా తీర ప్రాంతంలో కొత్త రైల్వే లైను విస్తరణకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విజయవాడ – గుడివాడ – భీమవరం – నిడదవోలు మార్గాన్ని డబ్లింగ్ చేశారు. వీటితో పాటు కొత్తగా మచిలీపట్నం – రేపల్లె – బాపట్ల మార్గాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో బాపట్ల – అద్దంకి – మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి బాపట్ల ఎంపీ ప్రతిపాదన చేశారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండి.. నత్తతో పోటీగా నడుస్తున్న కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ మార్గం కూడా అందుబాటులోకి వస్తే.. బాపట్ల నుంచి నేరుగా మచిలీపట్నం – నరసాపురం – కోటిపల్లి – కాకినాడ మీదుగా సామర్లకోట ట్రాక్‌లో కలుస్తుంది. దీని వల్ల విజయవాడ – రాజమండ్రి మధ్య లైన్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు చెన్నై – విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది.
Also Read : బ్రేకింగ్: యుద్ధం ఆపేస్తున్నాం, ట్రంప్ సంచలన ప్రకటన
దాదాపు 35 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నడికూడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే న్యూ పిడుగురాళ్ల నుంచి శావల్యపురం, దర్శి, పొదిలి, కనిగిరి వరకు కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. 2027 మార్చి నాటికి పామూరు వరకు పూర్తి చేస్తామంటున్నారు రైల్వే అధికారులు. ఈ మార్గం వల్ల హైదరాబాద్ – తిరుపతి మధ్య కొత్త లైను అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ – కర్నూలు – అనంతపురం – బెంగళూరు మార్గం అందుబాటులో ఉంది. వీటితో పాటు కొత్తగా 3 మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ కూడా నిర్మించనున్నట్లు తాజాగా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఇవన్నీ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం పదేళ్లు సమయం పడుతుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారా సరుకు రవాణాతో పాటు ప్రయాణీకులకు మెరుగైన రవాణ వ్యవస్థ కూడా అందుబాటులోకి వస్తుంది.

