Thursday, September 17, 2026 08:09 PM
Thursday, September 17, 2026 08:09 PM

‘రాజనీతి సురేష్‌’ పై వంద కోట్ల దావా.. అంత భయం ఎందుకు?

ఒక చిన్న వీడియోకు వేల కోట్ల సామ్రాజ్యం భయపడిందా..? రెండున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్‌లో వచ్చిన ఓ కథనం చూసి ఎందుకు అంత భయం..? ఒక సాధారణ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చేసిన వీడియోకు భయపడి.. ఏకంగా వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని భయపెట్టడం ఏమిటి..? వీడియో డిలీట్ చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెదిరించటం ఏమిటీ..?.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బెదిరించిన సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. మెయిల్.. అని ముద్దుగా పిలుస్తారు.

అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు సీఆర్‌డీఏ అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే పనుల్లో వేగం లేదని సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు సంస్థల వెంటబడితే తప్ప పనుల్లో వేగం రాదని స్పష్టంగా చెప్పారు కూడా. సీఆర్‌డీఏ లెక్కల ఆధారంగానే పనుల్లో వేగం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి వారం లేదా పది రోజులకు ఓసారి అమరావతి పనులు దక్కించుకున్న సంస్థల పనితీరు ఎలా ఉందో సీఆర్‌డీఏ అధికారులు డాష్ బోర్డులో నమోదు చేస్తారు. ఇది అధికారిక సమాచారం. ఈ లెక్కలు చూసిన చంద్రబాబు.. అధికారులకు చీవాట్లు పెట్టారు. పనుల్లో వేగం లేదని అసహనం వ్యక్తం చేశారు.

Also Read : ఏపీ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్

రాజనీతి అనే యూ ట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తున్ కల్లూరి సురేష్ అనే సీనియర్ పాత్రికేయులు కూడా ఇదే లెక్కల ఆధారంగానే వీడియో చేశారు. సీఆర్‌డీఏ డాష్ బోర్డు ఆధారంగా ఫిబ్రవరి 7, 14, 28వ తేదీ నాటికి ఎంత పని జరిగింది.. ఏ సంస్థ తన టార్గెట్ రీచ్ అయ్యింది అని వివరించారు. అమరావతిలో మెజారిటీ పనులు దక్కించుకున్న సంస్థ మేఘా. సుమారు 20 శాతం పైగా పనులు ఈ సంస్థకే దక్కాయనేది అధికారిక సమాచారం. ఆ పనుల పురోగతి ఎలా ఉంది అనేది ప్రతి వారం సీఆర్‌డీఏ అధికారులు వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే కల్లూరి సురేష్ వీడియో చేశారు. పనులు దక్కించుకున్న మేఘా సంస్థ ఫిబ్రవరి 14వ తేదీ నాటికి 10.72 శాతం పనులు చేయాల్సి ఉండగా.. కేవలం 3.64 శాతం మాత్రమే చేసినట్లు డాష్ బోర్డులో అధికారులు నమోదు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 13.48 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. కేవలం 4.86 శాతం మాత్రమే పూర్తి చేసినట్లు సీఆర్‌డీఏ డాష్ బోర్డులో నమోదైన విషయాలను సురేష్ ప్రస్తావించారు. నిజానికి మేఘా మాత్రమే కాదు.. ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, ఆర్వీఆర్, ఎంవీఆర్, కేఎంవీ వంటి సంస్థలు కూడా టార్గెట్ రీచ్ కాలేదు. ఎల్ అండ్ టీ సంస్థ అయితే 22.32 శాతం పనులు చేయాల్సి ఉండగా… కేవలం 4.75 శాతం మాత్రమే పూర్తి చేసినట్లు సీఆర్‌డీఏ లెక్కలు చెబుతున్నాయి.

కానీ మేఘా సంస్థ మాత్రం.. తమ గౌరవానికి భంగం కలిగేలా సురేష్ వీడియో చేశారని.. దానిని వెంటనే డిలీట్ చేయాలని నోటీసులిచ్చింది. అలా డిలీట్ చేయకపోతే.. వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని.. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని నోటీసు జారీ చేసింది. ఉన్న మాట చెబితే ఉలుకెందుకు అన్నట్లుగా సీఆర్‌డీఏ డాష్ బోర్డులో ఉన్న విషయమే కదా చెప్పింది.. మరి అందులో పరువు పోయేలా ఏముంది. వీడియోలో అవాస్తవాలు ఉంటే.. కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఇవీ అని ప్రజలకు తెలియజేయాలి. లేదు పనుల్లో వేగం తగ్గడానికి కారణం ఇదీ అని వివరణ ఇచ్చుకోవాలి. అంతే తప్ప ఇలా పరువు నష్టం దావా, క్రిమినల్ కేసులు అని భయపెట్టడం ఏమిటీ..?

Also Read : వైసీపీ వారికి మాత్రమే ఎంట్రీ..!

అసలు పరువు నష్టం దావా వేయాల్సి వస్తే.. వైసీపీ అధికారిక మీడియా సాక్షి సంస్థపైన వేయాలి. నత్త నడకన అమరావతి పనులు అంటూ పదే పదే అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తోంది. మరి ఆ వార్తలు మేఘా సంస్థ ప్రతినిధులకు కనిపించలేదా.. అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. మొత్తానికి గుమ్మడి కాయల దొంగ ఎవరూ అంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉంది మేఘా సంస్థ తీరు.. అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్