ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు రావటం లేదు. కేవలం ఎమ్మెల్సీలు మాత్రమే మండలికి వస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న డిమాండ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి పది శాతం ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్షంగా గుర్తిస్తారు. అంటే వైసీపీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ 11 మంది మాత్రమే గెలవటంతో హోదా ఇవ్వలేమని స్పీకర్ తేల్చి చెప్పారు. దీంతో సభకు వచ్చేది లేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభ జరుగుతున్నని రోజులు.. సభకు వచ్చి సంతకం చేసి వెళ్లిపోతున్నారు తప్ప.. లోపలికి వచ్చి చర్చలో పాల్గొనటం లేదు.
Also Read : నా దుడ్లుతో కొనుక్కున్నా.. వైసీపీకి లోకేష్ మార్క్ కౌంటర్..!
వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు కొందరు దొంగలా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ బ్రేక్ సమయంలో ఆవరణలో టీడీపీ ఎమ్మెల్యేలకు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తారసపడ్డారు. ఈ సమయంలో కుశల ప్రశ్నలు వేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తముల అశోక్ రెడ్డి, ఎంఎస్ రాజు, రాజశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా చంద్రశేఖర్‌ను పలకరించారు. నియోజకవర్గంలో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలంటూ గొట్టిపాటి సూచించారు.
ఆ తర్వాత చంద్రశేఖర్‌తో సరదాగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు.. బిల్ గేట్స్ పర్యటన గురించి ప్రస్తావించారు. బిల్ గేట్స్‌ను విమర్శించే స్థాయికి మీ పార్టీ దిగజారి పోయిందేంటన్నా అంటూ ఏలూరి సాంబశివరావు వేసిన ప్రశ్నకు చంద్రశేఖర్ సైలెంట్ అయ్యారు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ లెక్కలు అడగకుండా.. బిల్ గేట్స్ టీ, కాఫీ ఖర్చులంటారా..? అని ఎంఎస్ రాజు వేసిన ప్రశ్నకు చంద్రశేఖర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పాపం సుధాకర్ బాబు అని అశోక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రశేఖర్ ఏం జవాబు చెప్పలేక పోయారు. అన్నీ తెలిసే నన్ను ఆడుకుంటున్నారుగా.. మీకో నమస్కారం అంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
Also Read : ఒక్క వీడియోతో ట్రెండ్ సెట్ చేసిన అన్నాడిఎంకే..!
ఓ వైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాఖల వారీగా కేటాయింపుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే.. దానిపై సభలో కూటమి సర్కార్‌ను ప్రశ్నించాల్సిన జగన్.. సభకు రావటం లేదు. కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల గురించి ప్రశ్నించకుండా.. ఇలా టీ, సమోసా లెక్కలు అడగటమేంటనే చర్చ జోరుగా జరుగుతోంది. అన్ని తెలిసే ఆడుకుంటున్నారుగా.. అన్న వైసీపీ ఎమ్మెల్సే మాట వెనుక చాలా అర్థం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ నేతలు ఏం మాట్లాడాలన్నా.. అది ప్యాలెస్ పెద్దల నుంచి రావాల్సిందే అనే విషయం తెలిసి కూడా ఆడుకుంటున్నారుగా.. అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్పకనే చెప్పినట్లున్నారు.

