తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ ఛార్జ్‌షీట్ సమర్పించిన తర్వాత వైసీపీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. పాలు, పెరుగు లేకుండానే కేవలం రసాయనాలతోనే నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి తిరుమలకు సరఫరా చేసినట్లు రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. అయితే ఇందులో జంతువుల కొవ్వుతో చేసినట్లు ఆధారాలు లభించలేదన్నట్లుగా రిపోర్ట్‌లో ఉంది. ఈ ఒక్క పాయింట్ మాత్రమే వైసీపీ నేతలు పట్టుకున్నారు. జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేశారని గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని జీడి పాకం మాదిరిగా సాగదీస్తున్నారు. అయితే ఇదే సమయంలో అసలు విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం మాత్రం జోరుగా జరుగుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం సహా తిరుమల దివ్య క్షేత్రంలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. అడ్డగోలుగా దర్శనాల కేటాయింపు, టీటీడీ నిధులను దారి మళ్లించడం, దుర్వినియోగం, సామాన్య భక్తుల కనీస అవసరాలు కూడా నాటి టీటీడీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో నిత్యం ఏదో ఒక వివాదం టీటీడీని అప్రతిష్ఠ పాలు చేసింది. చివరికి టీటీడీలో సౌకర్యాలపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు కూడా పెట్టింది. ఇక మాజీ మంత్రులు రోజా, సీదిరి అప్పల్రాజు వంటి నేతలు అయితే తమకు నచ్చినంత మందిని, తమతో వచ్చినంత మందికి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారు. ఇదేలా సాధ్యం అంటే.. మా ప్రభుత్వంలో కుదురుతుంది అంటూ బడాయి చెప్పారు కూడా.
Also Read : అజిత్ మృతి.. బీజేపీకి గోల్డెన్ ఛాన్స్..!
కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఓ వైపు రుజువవుతున్నప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం.. అందులో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఆనవాళ్లు లేవు కదా అని బుకాయిస్తున్నారు. ఇదే సమయంలో మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వింత వాదన తెర పైకి తీసుకువచ్చారు. నిజానికి తప్పు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో.. దానిని బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. మరి హిందువుల మనోభావాలతో చెలగాటమాడుకున్నది ఎవరూ..? అనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన సజ్జల.. మొత్తం చంద్రబాబు చేశారంటూ వితండ వాదం చేస్తున్నారు. పైగా.. టీటీడీలో ఏం జరుగుతుందో జగన్‌కు ఎలా తెలుస్తుంది.. శాఖల్లో ఏం జరుగుతుందో జగన్‌కు ఎలా తెలుస్తుంది.. అని ఎదురు ప్రశ్నించారు. వ్యవస్థ ఎలా నడవాలనే విషయం మాత్రమే ముఖ్యమంత్రి చూశారని.. కిందిస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిపైన పర్యవేక్షణ ఉండదు కదా.. అన్నారు.
“వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకు అలవాటు. తన నిరాధారమైన వ్యాఖ్యలతో మా ప్రభుత్వానికి ఉన్న పేరును దెబ్బతీయడమే కాదు కోట్లాది మంది ప్రజల మనోభావాలనూ దెబ్బతీశారు.” అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. అయితే సజ్జల కూడా గతంలో జరిగిన కొన్ని విషయాలు మర్చిపోయినట్లున్నారు. పింక్ డైమండ్ మిస్సింగ్ అంటూ తిరుమలలో జరగని దొంగతనాన్ని జరిగినట్లు ప్రచారం చేసింది వైసీపీ నేతలే. అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నిరాధారమైన వ్యాఖ్యలంటూ కోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. ఇక వ్యక్తిత్వ హననం అంటూ సజ్జల నోటి నుంచి వచ్చిన నీతి మాటలు.. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని, వంశీ, రోజా, అప్పల్రాజు, అనిల్, అంబటి రాంబాబు, ద్వారంపూడి, ధర్మాన, దువ్వాడ వంటి నేతలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు నోటీకి ఎంత మాట పడితే అంత మాట అనేశారు. చివరికి సజ్జల డైరెక్షన్‌లోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. మరి ఆ రోజు వ్యక్తిత్వ హననం, మనోభావాలు అనే మాటలు సజ్జలకు గుర్తు రాలేదా అని నిలదీస్తున్నారు.
Also Read : ఎయిర్ ఇండియా క్రాష్.. పైలట్ పాత్రపై అనుమానాలు
ఓ వైపు జంతువుల కొవ్వు కాదు అంటూనే.. అది కెమికల్ కలిసిన నెయ్యి అంటున్నారు కదా.. అని వింత వ్యాఖ్యలు చేశారు సజ్జల. అంటే పాలు లేకుండా కెమికల్‌తో నెయ్యి తయారు చేసినట్లు సజ్జల పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. కానీ ఆ విషయం బయటకు చెబితే.. తమ పాలనలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో నోరు విప్పటం లేదు. పైగా కల్తీ నెయ్యి అనే మాట సజ్జల నోటి నుంచి వస్తే.. ఆ మరుసటి రోజే సజ్జలకు కూడా బాత్‌రూంలో గుండె పోటు వస్తుందని భయపడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి కల్తీ జరిగింది.. కానీ అది జగన్‌కు తెలియదు అనేది సజ్జల చెప్పాలనుకున్న మాట.

