Wednesday, February 4, 2026 06:38 AM
Wednesday, February 4, 2026 06:38 AM

18 ఏళ్లు.. 30 ట్రాన్స్‌ఫర్లు.. ఎందుకు ఇంత పగ..?

ఒక అధికారి నిజాయితీకి బదిలీనే కొలమానం. నిజాయితీగా ఉంటే.. ఎవరికీ నచ్చదు. తమకు అనుకూలంగా ఉన్న అధికారి కోసం ఏ రాజకీయ నాయకుడైనా సరే.. పైరవీలు చేస్తారు. అదే నిజాయితీగా ఉంటే.. సార్.. ఈయన మా మాట వినటం లేదు.. బదిలీ చేసి.. మా మాటే వినే అధికారిని మాకు పంపండి.. అంటూ వరుస పెట్టి మరీ వినతులు చేస్తారు. అయినా పై వాళ్లు మాట వినకపోతే.. ఆ అధికారిపై ఫిర్యాదులు చేస్తారు. ఆరోపణలు చేస్తారు. వేధింపులకు తెగబడతారు. చివరికి బదిలీ వేటు పడే వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందుకే నిజాయతీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారికి బదిలీయే అసలైన రివార్డు.

తాజాగా ఓ పోలీస్ అధికారి బదిలీ వ్యవహరం పెద్ద దుమారం రేపుతోంది. సాధారణంగా ఎవరినైనా బదిలీ చేస్తే.. కనీసం ఏడాది పాటు ఆయన ఆ స్థానంలో కొనసాగుతారు. కానీ.. ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్‌ అధికారిని మాత్రం కేవలం 40 రోజుల్లోనే బదిలీ చేశారు. ఇంకా చెప్పాలంటే బలవంతంగా బదిలీ చేయించారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సదరు అధికారి సర్వీసులో చేరి ఇప్పటికి 18 ఏళ్లు. ఈ 18 సంవత్సరాల సర్వీసులో 5 కాదు, 10 కాదు.. ఏకంగా 30 సార్లు బదిలీ అయ్యారు. ఆయనెవరో కాదు.. కుమరి శ్రీరామ్. సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్.

Also Read : వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!

కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐగా విధుల్లో చేరిన శ్రీరామ్.. సరిగ్గా రోజుల్లోనే బదిలీ అయినట్లు ఉత్తర్వులు అందుకున్నారు. నిజానికి శ్రీరామ్‌కు బదిలీ కొత్త కాదు. ఈ బదిలీ ఆయనకు ఆశ్చర్యం కలిగించలేదు కూడా. ఎందుకంటే.. 18 ఏళ్ల సర్వీసులో ఆయనకు ఇది 30వ బదిలీ. అయితే శ్రీరామ్ బదిలీపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. శ్రీరామ్ పై బదిలీ వేటు వేయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు కూడా.

2007లో పోలీస్ శాఖలో చేరారు శ్రీరామ్. తొలి రోజు నుంచి నిక్కచ్చిగా వ్యవహిస్తారనేది శ్రీరామ్ పేరు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రీరామ్‌.. తన ప్రతి చర్యను ఇన్ స్టా సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేస్తారు. దీంతో శ్రీరామ్‌ ఫాలోవర్లు కూడా ఎక్కువే. డ్యూటీలో నిబద్ధతతో పని చేస్తారనే పేరున్న శ్రీరామ్‌.. ప్రస్తుత బదిలీ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. 2025 డిసెంబర్ 18వ తేదీన ప్రొద్దుటూర్ వన్ టౌన్ సీఐగా శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు నుంచే తన పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఆస్కారం లేదని తేల్చేశారు. మద్యం షాపులు ప్రభుత్వం సూచించిన సమయంలోనే ఉండాలని ఆదేశించారు. పేకాట రాయుళ్లపై ఉక్కుపాదం మోపారు. పాత రౌడీ షీటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతే.. సరిగ్గా 40 రోజులకు బదిలీ లేఖ అందుకున్నారు.

ప్రొద్దుటూరు పట్టణంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా విధులు నిర్వహించారని శ్రీరామ్‌ పేరు తెచ్చుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో 1982 తర్వాత మంచి అధికారి వచ్చాడని భావించాం. రోజుల వ్యవధిలోనే సీఐని బదిలీ చేయడం పై పట్టణంలో చర్చ జరుగుతోందని ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖులు వ్యాఖ్యానించారు. 2007 బ్యాచ్ ఎస్ఐ శ్రీరామ్ అనంతపురం జిల్లా ముదిగబ్బ పోలీస్ స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైగా చేరారు. ఆ తర్వాత ఆయన కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కదిరి, కంబదూరు, కనగానిపల్లె బెళుగుప్ప, ధర్మవరం, పెద్దవడగూరు, అనంతపురం పోలీస్ స్టేషన్‌లలో ఎస్సైగా పనిచేశారు. సీఐగా పదోన్నతి పొందిన తర్వాత శ్రీరామ్ అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని, కర్నూల్, శ్రీకాళహస్తి పట్టణాల్లో పనిచేశారు. ఆదోని నుంచి 40 రోజుల కిందటే బదిలీపై వచ్చిన శ్రీరామ్.. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read : ఆ ప్లేయర్ ను ఆడుకుంటున్న గిల్ ఫ్యాన్స్

ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా, ఇతర జూద కలాపాలను కట్టడి చేయడంలో కఠినంగా వ్యవహరించారని శ్రీరామ్ పేరు తెచ్చుకున్నారు. మద్యం షాపులు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలనే ప్రభుత్వ నిబంధనను కఠినంగా అమలు చేయడం రాజకీయంగా శ్రీరామ్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సీఐగా శ్రీరామ్ వచ్చిన తర్వాతే ప్రొద్దుటూరులో పరిస్థితి మెరుగుపడిందని.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. సీఐ శ్రీరామ్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించడంలో నిబద్ధతతో వ్యవహరించారని ప్రశంసించారు.

నిబంధనలు అమలు చేయడంలో రాజకీయాలకు అతీతంగా సీఐ శ్రీరాం పనిచేశారని.. అందుకే ఆయనపై బదిలీ వేటు వేశారనేది వైసీపీ నేతల మాట. రోజుల వ్యవధిలోనే సీఐ శ్రీరాం బదిలీ అవ్వటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రౌడీషీటర్లు, క్రికెట్‌ బుకీలు, రౌడీషీటర్లను కౌన్సెలింగ్‌కు పిలిచి తనదైన శైలిలో హెచ్చకలు జారీ చేశారు. ఎప్పుడు హాజరు కాని పాత కేసుల్లో నిందితులుగా ఉన్న నాయకులను కూడా కౌన్సెలింగ్‌కు పిలిపించి హెచ్చరికలు చేశారు. ఓ కేసులో ప్రొద్దుటూరు మునిసిపల్ మాజీ వైఎస్ ఛైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి అలియాస్ బంగారు రెడ్డిని స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.

నిజానికి ప్రొద్దుటూరుకు ఫ్యాక్షన్ ఊరుగా పేరు. గతంలో ఫ్యాక్షన్ హత్యలతో ప్రొద్దుటూరు ప్రజలు భయపడే వారు. అయితే 1982లో సీఐగా వచ్చిన ఓ అధికారి.. మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత రౌడీ షీటర్ల ఎన్‌కౌంటర్లు, నగర బహిష్కరణలతో లా అండ్ ఆర్డర్‌ ఒక దారికి వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాక్షన్ వార్ తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి అధికారి వచ్చారని అంతా భావించారు. కానీ వచ్చిన 40 రోజుల్లోనే ట్రాన్స్‌ఫర్ వేటు పడటంతో ఏం జరిగిందనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read : ఆ కులానికే చంద్రబాబు ప్రాధాన్యత..!

ప్రొద్దుటూరులో తాజా, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజుల రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిది గురు శిష్యుల బంధం. ఈ ఇద్దరి మధ్య ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. పట్టణంలో రౌడీ షీటర్లకు సీఐ శ్రీరామ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. టీడీపీ, వైసీపీ అనే తేడా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఇదే శ్రీరామ్ బదిలీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పోలీస్ శాఖపై ఆరోపణలు వచ్చినప్పుడు అధికారుల సంఘం తీవ్రంగా స్పందిస్తుంది. రోజుల వ్యవధిలోనే ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీపై అధికారుల సంఘం కనీసం నోరెత్తడం లేదు. గతంలో అనేక సందర్భాల్లో జిల్లా పోలీసు సంఘం ఘాటుగా స్పందించింది. కానీ ఇప్పుడు మాత్రం.. ఈ విషయం తన పరిధిలో లేదన్నట్లుగా వ్యవహరించడం పెద్ద దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్