వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి నిజంగానే షాక్ లపై షాక్ లు ఇస్తారా..? ఈడీ విచారణకు హాజరైన తర్వాత సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ రాజకీయ భవిష్యత్తుపైన నీలి నీడలు కమ్మేలా చేశాయనే మాట బాగా వినిపిస్తోంది. సాయిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. వైసీపీ భవిష్యత్తుపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు స్పష్టమైన అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది కూడా. ఈడీ విచారణ తర్వాత సాయిరెడ్డి చేసిన విమర్శలు.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెర లేపాయి.
నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తర్వాత మొత్తం తానే అన్నట్లుగా వ్యవహరించారు సాయిరెడ్డి. కానీ ఇప్పుడు ఆయన మాటలు చూస్తే మాత్రం.. తాను జగన్‌కు పాలేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొన్ని పందికొక్కుల వల్ల తాను జగన్‌కు పరాయి వాడిని అయ్యాను.. అంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కొన్ని పందికొక్కులు తనను జగన్‌కు దూరం చేశాయని.. కొంతమంది జగన్‌ను తప్పుదారి పట్టించారంటూ వైసీపీ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను, ఆధిపత్య పోరును బయటపెట్టే్లా వ్యాఖ్యానించారు సాయిరెడ్డి. కేసుల విషయంలో నెంబర్ – 2 చేశారు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తనను వందో స్థానంలో కూడా ఉంచలేదని సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ పట్ల, జగన్ పట్ల ఆయనలోని అసంతృప్తిని బయటపెట్టినట్లు అయ్యింది.
2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తామని గొప్పగా చెప్పారు సాయిరెడ్డి. ఇక ఎన్నికల ఫలితాల రోజు వైసీపీ 151 స్థానాలు గెలిచింది అనగానే.. ముందుగా సాయిరెడ్డినే జగన్ ఆలింగనం చేసుకుని ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. కానీ ఇప్పుడు అదే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదంటున్నారు సాయిరెడ్డి. ఇవే ఇప్పుడు వైసీపీ క్యాడర్‌ను మానసికంగా దెబ్బ తీస్తున్నాయి కూడా. అలాగే జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు సాయిరెడ్డి.
Also Read : పద్మ పురస్కారాల లక్ష్యం అదేనా..!
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడు.. ప్రజాభిప్రాయం జగన్ వైపే.. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందనేది వైసీపీ నేతలు, అభిమానులు పదే పదే చెబుతున్న మాట. కానీ సాయిరెడ్డి మాత్రం.. ఎన్ని పాదయాత్రలు చేసినా ఫలితం ఉండదన్నారు. ప్రజల్లో జగన్ పట్ల, వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని.. వాటిని మార్చడం ఎవరి వల్ల కాదన్నారు సాయిరెడ్డి. కూటమి పార్టీలు విడిపోతే తప్ప జగన్ గెలిచే పరిస్థితి లేదన్నారు. అటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం.. 15 ఏళ్లు తమ పొత్తు కొనసాగుతుందని పదే పదే చెబుతున్నారు. అంటే.. జగన్ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది సాయిరెడ్డి మాట.
నిజానికి జగన్ నీడలా వ్యవహరించిన సాయిరెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ 2 గా ఉన్నారు. అలాంటి సాయిరెడ్డి ఈ ఏడాది జూన్ తర్వాత రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తా అని చెప్పారు. అంతేకానీ.. వైసీపీలోకి మళ్లీ వస్తా అని మాట మాత్రం కూడా అనలేదు. అంటే.. తాను వైసీపీలో చేరటం లేదని చెప్పకనే చెప్పేశారు. దీంతో జగన్‌కు మరింత దూరం అవుతున్నట్లు సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.
జగన్‌ను అత్యంత సన్నిహితంగా చూసిన సాయిరెడ్డి వైసీపీ భవిష్యత్తుపై ఇలా వ్యాఖ్యలు చేయడం సామాన్య కార్యకర్తలకు వైసీపీ భవిష్యత్తు మీద భయపడేలా చేస్తున్నాయి.
Also Read : ఇదేం కొట్టుడు.. టి20 వరల్డ్ కప్ లో భారత్ మిస్సైల్ అతనే..!
నిజానికి జగన్ చుట్టూ చేరిన కోటరీ అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిని మాత్రమే కాదు.. వైసీపీకి వెన్నెముక వంటి మేధావిని కూడా దూరం చేసిందనే మాట బాగా వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి రియలైజ్ అయ్యారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో వైసీపీ పతనానికి నాంది అనే మాట కూడా అంటున్నారు. వైఎస్ రాజారెడ్డి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా కొనసాగిన సాయిరెడ్డి.. తమ బంధం ముగిసిపోయిందనే వ్యాఖ్యలు చేయడం వైసీపీలో పెద్ద కుదుపు. ఏది ఏమైనా విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తల్లో, ఆ పార్టీ అభిమానుల్లో ఒక విధమైన భయం మొదలైందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

