వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాటం చేశారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు. తనను సస్పెండ్ చేసినా.. తప్పుడు కేసులు పెట్టినా.. తనను వేధించినా సరే.. వెనకడుగు వేయకుండా.. క్యాట్ నుంచి ఆదేశాలు తెప్పించుకుని.. సుప్రీంకోర్టులో పోరాటం చేసి మరీ అధికారి హోదాలోనే రిటైర్ అయ్యారు ఏబీ వెంకటేశ్వర్రావు. కూటమి గెలుపులో ఏబీ వెంకటేశ్వర్రావు కూడా తన వంతు సాయం చేశారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పోస్టు వస్తుందని అంతా భావించారు. అయితే ఏబీవీని కనీసం సంప్రదించకుండానే ఆయనను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు చంద్రబాబు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఏబీవీ.. ఆ పదవిని స్వీకరించలేదు.
Also Read : సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం అటేనా..?
ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వైఎస్ జగన్‌పైన, వైసీపీ నేతలు చేసిన అరాచకాల పైన కూటమి సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే మాదిరిగా వాస్తవాలు బయటపెడుతున్నారు. తాజాగా రాజధాని అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలు, అమరావతి ఆలస్యానికి కారణాలను ఏబీ వెంకటేశ్వర్రావు బయటపెట్టారు. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకునేందుకు చాలా పిటిషన్లు వేశారని.. అందులో జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఒకరన్నారు. సుప్రీం కోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. NGT లో కేసులు వేసి.. పనులను మూడేళ్ల పాటు సాగదీశారన్నారు అందుకే నిర్మాణం పూర్తి కాలేదన్నారు. బొలిశెట్టి పిటషన్ వెనుక వైసీపీ ఉందని పరోక్షంగా విమర్శించారు.

ఏబీవీ చేసిన ఆరోపణలకు బొలిశెట్టి ఘాటుగా స్పందించారు. ఏబీవీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. “అబద్ధపు ఆరోపణలు ఇక చాలు – వాస్తవాలు మాట్లాడదాం రండి.. అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అమరావతిలోనే రాజధానిగా ఉండాలని, రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్ మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే! వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో.. జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది నేను.. అలాంటి నేను వైఎస్ జగన్ మనిషినా?.. సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణే నా ఏకైక లక్ష్యం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను.. మీ కట్టుకథలను పక్కన పెట్టి, తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. లేదంటే, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రండి? సమయం, వేదిక మీరే నిర్ణయించండి!” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : కేటిఆర్ విచారణ వెనుక కవిత.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణ..!
బొలిశెట్టి విసిరిన సవాల్‌ను ఏబీవీ స్వీకరించారు. గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఏబీవీ పోస్ట్ పెట్టారు. “బొలిశెట్టి సత్యనారాయణ గారూ, పనుల్లో పడి మళ్లీ మర్చిపోతానేమోనని వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నాను. చరిత్ర చెరిపేస్తే చెరిగి పోదు, సింపేత్తే సిరిగిపోదు. గతంలోని మీ వీడియో ల శాంపిల్ లింకులు ఇక్కడ ఇస్తున్నాను. ఒక మిత్రుడు మీ గురించి Gemini ని అడిగితే అది ఇచ్చిన సమాచారం కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు, శ్రీమన్నారాయణ గారు లాంటి వారు NGT లో, సుప్రీమ్ కోర్టులో కేసులు వేయబట్టే అమరావతి నిర్మాణ పనుల ప్రారంభం ఆలస్యం అయిందని నేను అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఇహపోతే నేను సర్వీసులో ఉండగా చేసిన అరాచకాల మీద సెపరేట్‌గా డిబేట్ పెట్టుకుందామన్నారు. ఆ అరాచకలేవో ఇక్కడో, మీ FB లోనో పెడితే చర్చకు సిద్ధం.” అని ఏబీవీ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్టులో గతంలో అమరావతిపై బొలిశెట్టి చేసిన వ్యాఖ్యల వీడియో లింక్ కూడా ఉంచారు ఏబీవీ. దీంతో మొత్తానికి బొలిశెట్టిని ఏబీవీని ఇరికించారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

