అది ముమ్మాటికీ “త్రిమూర్తుల” నిర్లక్ష్య హత్యే నా..? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానులంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత రాజధాని నిర్మాణం కోసం భూములచ్చిన అనేక మంది రైతుల గుండె ఆగిపోయింది. నిజానికి ఆ మరణాలన్ని కూడా నాటి జగన్ సర్కార్ హత్యలే. ఇదే మాట నాటి ప్రతిపక్ష నేతల చంద్రబాబు స్వయంగా అన్నారు కూడా. నాడు జగన్ సర్కార్ రైతులపై లెక్కలేనన్ని అరాచకాలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని నాటి జగన్ సర్కార్ పక్కన పెట్టినప్పుడే భూములిచ్చిన రైతు గుండె ఆగిపోయింది. అమరావతి రాజధాని కాదు.. 3 రాజధానులంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజే రైతు గుండె ఆగిపోయింది. పరిపాలన, శాసన, న్యాయ రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన రోజే రైతు గుండె ఆగిపోయింది. రాజధాని నిర్మాణం కోసం రైతులు రోడెక్కిన రోజున.. కాయకష్టం చేసుకునే అన్నదాతలను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ సైకోలు, జగన్ భజన చేసిన నేతలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రోజే రైతు గుండె పగిలిపోయింది. చివరికి తమ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించిన మహిళా రైతుల పట్ల అనుచితంగా, అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేసి.. తప్పుడు కేసులు పెట్టి వేధించిన రోజే రైతుల గుండె పగిలింది. మరి ఇది తప్పు అని ఆరోజు వైసీపీ నేతలు జగన్‌ను ఎందుకు నిలదీయలేదో ఇప్పటికీ అర్థం కావటం లేదు. పైగా ఆరోజు ఇదే రాజధాని రైతు తరఫున ఎందుకు నిలబడలేదో కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం.
Also Read : ఏపీ కేబినేట్ సమావేశంలో సంచలన పరిణామం..!
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరూ అంటే.. అంతా ముక్తకంఠంతో చెప్పే మాట ఒకటే. రాజధాని అమరావతి పాలిట అశనిపాతంగా మారింది ఎవరు అంటే.. అందరూ చెప్పే పేరు కూడా ఒకటే. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ దాష్ఠికానికి ప్రత్యక్ష ఉదాహరణ రాజధాని అమరావతి రైతు. వృద్ధులు, మహిళలు, చంటి పిల్లలు అనే తేడా లేకుండా బూటు కాళ్ల కింద వేసి తొక్కేసిన చరిత్ర వైసీపీ సర్కార్ సొంతం. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న రైతులపై దాడులు.. ఆడవాళ్లు స్నానాలు చేస్తుంటే.. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి వికృత ఆనందానికి పాల్పడిన రోజులు ఇప్పటికీ రాజధాని ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. మూడు రాజధానుల విదానం ప్రకటన తరువాతే.. అనేక మంది రైతులు గుండె ఆగిపోయి మరణించటంతో, ఆ మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే అని అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలను వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం టార్గెట్‌గా చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రాజధాని అమరావతి రైతుకు తమ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని.. రైతులకు అండగా నిలబడింది తామే అని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా.
నిజానికి రైతు రాములు చనిపోవడానికి చాలా కారణాలున్నాయి. తన అభిప్రాయం వెల్లడించేందుకు వచ్చిన రాములు అనే రైతు.. వేదిక ముందు కుప్పకూలిపోయారు. ఆయనను మంత్రి తన కాన్వాయ్‌లోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు రాములు మృతి చెందారు. రాములుకు ఇప్పటికే రెండు సార్లు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేశారు. సమావేశానికి కూడా తోటి రైతులతో కలిసే వచ్చారు. రహదారి నిర్మాణానికి తమ ఇళ్లను ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ అక్కడే ఉన్న మీడియా మిత్రులంతా చూశారు కూడా. ఆ తర్వాత కుర్చీలో కూర్చొనే క్రమంలో అస్వస్థతకు గురయ్యారు
Also Read : ఏపీ రియల్ రంగానికి బూస్ట్..? మారుతోన్న పరిస్థితి..!
నిజానికి రాములు మృతికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ.. లోతుగా పరిశీలిస్తే మాత్రం.. రైతు రాములు మృతికి ప్రధానం ఆ ముగ్గురే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. అయినా సరే.. ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్లాట్ కూడా అభివృద్ధి చేసి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం 2027 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని పదే పదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా ఏపీ సీఆర్‌డీఏలో కొందరు అధికారులు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కారణమనేది రైతుల ఆరోపణ.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఇప్పటికీ మ్యాప్‌లో మాత్రమే కనిపిస్తున్నాయి. 25 లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా ఇప్పటికీ అభివృద్ధి చేయలేదు. వీటి గురించి అధికారులు కనీసం స్పందించటం లేదు. ఏపీ సీఆర్‌డీఏలో ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనేది రైతుల ఆరోపణ. ప్లాట్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినప్పటికీ.. అధికారుల్లో మాత్రం చలనం రావటం లేదు. రైతులు గురించి పట్టించుకునే నాధుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ పదవి నుంచి కాటమనేని భాస్కర్‌ను బదిలీ చేసిన నాటి నుంచి అమరావతిలో రైతులకు సరైన సమాధానం చెప్పే అధికారి కూడా కరువయ్యాడనే మాట బాగా వినిపిస్తోంది. మరి రైతుల్లో ఉన్న అసహానాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

