ఏపీలో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. అదే విజయ రామరాజు. 2012 బ్యాచ్ ఆలిండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.. ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కడప జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా సబ్ కలెక్టర్ వంటి కీలక పదవులు కూడా నిర్వహించారు. బిట్స్ పిలాని వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ పూర్వ విద్యార్థి కూడా. ఐఏఎస్ అయ్యే ముందు భారతీయ రైల్వేలో కొద్ది కాలం పాటు పని చేశారు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన విద్యా శాఖ బాధ్యతలను మంత్రి నారా లోకేష్ చేపట్టారు. విద్యా శాఖలో సమూల మార్పులు చేస్తూ.. చక్కటి విద్యాభోదన, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారు. అదే సమయంలో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తూ.. ఉపాధ్యయ సంఘాల నేతలతో మర్యాద పూర్వకంగా మెలుగుతున్నారు.
Also Read : కేటీఆర్ సైడ్ అయిపోతున్నారా..? హరీష్ ను రేవంత్ ఎందుకు గురి పెట్టారు..?
ఇదంతా ఒకెత్తు అయితే.. విద్యా శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ రామరాజు తీరు వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. విజయ రామరాజు పుణ్యమా అని మరోసారి ఉపాధ్యాయులు చంద్రబాబు పైన, కూటమి ప్రభుత్వంపైన కావాల్సినంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఏడాది పైగా కష్టపడి కూటమి సర్కార్ కష్టపడి తెచ్చుకున్న మంచి పేరు మొత్తం విజయ రామరాజు పిచ్చి చేష్ఠలతో పూర్తిగా పోయిందనే మాట ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇందుకు విజయ రామరాజు తీసుకుంటున్న చర్యలతో పాటు, ఉపాధ్యాయుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ. నిజానికి వైసీపీ ప్రభుత్వంపైన ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి, జగన్ పాలన పైన వ్యతిరేకత పెరగటానికి ప్రధాన కారణం.. నాటి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తీరు. ఉపాధ్యాయులకు ప్రవీణ్ ప్రకాష్ నరకం చూపించారనేది అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే వైసీపీ ఓటమిలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు విజయ రామరాజు తీరు చూస్తే.. ప్రవీణ్ ప్రకాష్‌ను మరిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రవీణ్‌ను మించిపోయారనే మాట కూడా వినిపిస్తోంది. ఇందుకు ఆయన చేస్తున్న పనులనే ఉదాహరిస్తున్నారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలో పార్వతీపురం కలెక్టర్ చేపట్టిన ముస్తాబు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేపడితే బాగుంటుందన్నారు. దీంతో రంగంలోకి దిగిన విజయ రామరాజు.. సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఆ ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశించారు. నిజానికి ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముస్తాబు కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులను చక్కగా రెడీ అయ్యేలా చూసే బాధ్యతను అక్కడి పాఠశాలలకు కలెక్టర్ అప్పగించారు. కానీ దీనిని ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేయాలనేది విజయ రామరాజు ఆర్డర్. పిల్లలు స్నానం చేశారా, పౌడర్ రాసుకున్నారా, తల దువ్వుకున్నారా, చొక్కా గుండీలు పెట్టుకున్నారా అనేది చూసి.. ఆ వివరాలను ఓ యాప్‌లో ఏ రోజుకు ఆ రోజు నమోదు చేయాలి. ఇందుకోసం ఓ షీట్ తయారు చేశారు కూడా. అలా చేయకపోతే.. ఆ రోజు సాయంత్రానికి ఆ పాఠశాల హెడ్‌మాస్టర్‌కు మెమో వస్తుంది.
Also Read : కేసీఆర్: ఉద్యమ నేత నుంచి ఒంటరి యోధుడి వరకు
ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించరాదు అనే రూల్ ఉంది. కానీ నిజానికి ఇప్పటికే ఉపాధ్యాయులను మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, టాయ్ లెట్ నిర్వహణ, నో బ్యాగ్ డే, స్వచ్ఛ ఆంధ్ర.. వంటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వీటితో పాటు మెగా పేరెంట్, టీచర్ మీట్ అదనం. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ముస్తాబు కార్యక్రమం అదనం. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల ముస్తాబును టీచర్లు పర్యవేక్షిస్తే.. ఇక ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారని నిలదీస్తున్నారు. సెలవుల విషయంలో కూడా విజయ రామరాజు తీరును తప్పుబడుతున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు క్రిస్‌మస్ పండుగ అంటే ప్రభుత్వ పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులిచ్చారు. కానీ ఈ ఏడాది మాత్రం కేవలం ఒక్కరోజు మాత్రమే ఇచ్చారు. ఎస్సీ సిబ్బందికి మాత్రం ఆప్షనల్ హాలీడే ఇచ్చారు. దీని వల్ల ఇతర సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కూడా. ముస్తాబు వంటి కార్యక్రమంతో పాటు అకాడమిక్ విషయాల్లో కూడా విజయ రామరాజు తీవ్ర అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూటమి సర్కార్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టి సారించకపోతే ఉపాధ్యాయ సంఘాలతో పాటు, ఉపాధ్యాయుల్లో కూడా కావాల్సినంత వ్యతిరేకత రావడం ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.

