సామాన్లు అంటూ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. నిజానికి శివాజీ చెప్పిన నాలుగు మంచి మాటలు పక్కన పెట్టేసి.. నోరు జారిన రెండు పదాలనే పట్టుకుని వేలాడుతున్నారనేది చాలా మంది అభిప్రాయం. “మీ అందం చీరలోనే, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది తప్పిదే.. సామాను కనపడే దాంట్లో ఏముండదు” అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన ఎవర్నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. హీరోయిన్లు సినిమాల్లో కథా పరంగా వేసుకునే దుస్తుల గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం ఫంక్షన్లు, ఈవెంట్లకు వచ్చే సమయంలో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవద్దు అన్నారు శివాజీ. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయ్ సోషల్ మీడియాలో స్పందించగా.. చిత్తూరులో ఓ దుకాణ ప్రారంభానికి వెళ్లిన అనసూయ కూడా పాత్రికేయులు వేసిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఎవరికి ఏది సౌకర్యమూ.. ఎవరికి ఏది ఇష్టమో.. అది తింటారు.. అదే వేసుకుంటారు.. అంతే తప్ప.. ఇలాగే ఉండాలంటూ రూల్స్ పెట్టొద్దు అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
Also Read : టీడీపీ మంత్రుల్లో లోకల్ లీడర్ల టెన్షన్..?
అయితే అనసూయ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అనసూయకు మద్దతు తెలిపితే.. కరాటే కల్యాణి వంటి నటీమణులు శివాజీకి మద్దతు తెలిపారు. అనసూయ ఇంట్లో పూజలప్పుడు చీర కట్టుకుని.. రోడ్డు మీదకు సగం డ్రెస్ ఎందుకు వేసుకుని వస్తున్నారని కల్యాణి ప్రశ్నించారు. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన శివాజీ.. తాను ఎవర్నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని.. ఆ రెండు పదాలు అనకుండా ఉంటే.. ఇంత దుమారం జరిగేది కాదన్నారు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో అంతా తన వ్యాఖ్యలను అనసూయ, చెన్నయ్‌ను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారో తెలియటం లేదన్నారు.
శివాజీ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించారు. ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా’ అని వీడియో రిలీజ్ చేశారు. ‘మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఆయనకు అనిపించింది చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పా’.. అని వ్యాఖ్యానించిన అనసూయ.. మరో అడుగు ముందుకు వేశారు. శివాజీ చేతగానితనంతో మాట్లాడుతున్నారని.. అసలు ఫెమినిజం అనేది లేదన్నారు. ‘ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ, పురుషులు ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడటం చేతగానితనం’.. అన్నారు అనసూయ.
Also Read : రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కు మైండ్ బ్లాక్
సోషల్ మీడియాలో అనసూయ వీడియోపై భిన్న వాదనలు వస్తున్నాయి. ముందుగా శివాజీ చేసిన సామాన్లు అనే పదం ఇబ్బంది కరంగా ఉన్నాయంటున్న వారికి కొందరు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. శివాజీ చేసిన పదం తప్పు అయితే.. రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాలో చికిరి పాటలో సరుకు, సామాన్లు అంటూ ఉన్న పదాలు తప్పు కాదా.. అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద హీరో కుటుంబం కాబట్టి.. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అనసూయ, చిన్మయ్‌ను ఉద్దేశించి పోస్టులు, వీడియోలు చేస్తున్నారు. “చికిరి చికిరి సాంగ్ లో సామాన్లు అనే లైన్ ఉంది.. అదేంటి అలా ఉండటం మీ దృష్టిలో తప్పు కదా?.. ఎందుకు మరి మీ గొంతు వినిపించలేదు అప్పుడు?.. ఓహో అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం కాబట్టి అంతే నా?..” అంటూ నిలదీస్తున్నారు. నిండుగా, పద్దతిగా ఉండండి అంటే తప్పయ్యిందా.. అదే మనిషి విప్పుకుని తిరగండి అంటే గ్రేట్ అయిపోతాడు కదా మీకు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనపై వస్తున్న విమర్శలకు అనసూయ స్పందించారు. “కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింప జేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదు.” అని ఉదయం 10 గంటలకు ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత 12 గంటలకు మరో పోస్ట్ పెట్టారు అనసూయ.
Also Read : ఏపీలో ఇప్పటికీ కొనసాగుతున్న వైఎస్ జగన్ పాలన..!
“ఉన్న అంశాన్నీ సరిగ్గా చెప్పటం చేతకాక.. నన్ను వయసుతో షేమ్ చేస్తున్నారు. నన్ను ఆంటీ అంటున్న వారు.. శివాజీని మాత్రం గారు అంటున్నారు. నాకు 40, ఆయనకు 54 అనుకుంటా.. అయినా ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసమో.. పర్సనల్ గానూ ఫిట్‌నెస్‌ను, గ్లామర్‌ను మెయింటెయిన్ చేస్తున్నాం.. అనేవాళ్లు అంతా నిత్య యవ్వనులు.. అది వేరే విషయం అనుకోండి..సర్లేండి… ఇంతకంటే ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే..” అంటూ మరో పోస్టు పెట్టారు. నిజానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు అనసూయను మాత్రమే ఉద్దేశించి కాదు. అందర్నీ చక్కగా బట్టలు వేసుకోమన్నారు. కానీ ఈ విషయాన్ని అనసూయ ఎందుకు ఇంత పర్సనల్‌గా తీసుకున్నారనేది అర్థం కానీ విషయం. పొట్టి బట్టలతో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే అనసూయ.. మా గురించి మాట్లాడితే.. ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వటం ఏమిటో అర్థం కాని విషయం.
సినిమాలో చేసిన క్యారెక్టర్‌తో నటీనటులకు గుర్తింపు వస్తుంది. రమ్యకృష్ణను శివగామిగా, శ్రీదేవిని అతిలోక సుందరిగా, అనుష్కను అరుంధతిగా, బ్రహ్మానందం పేరును అర గుండుగా, ఏవీఎస్‌ను తుత్తిగా.. జనాలు గుర్తు పెట్టుకున్నారంటే.. అది వాళ్లు వేసిన క్యారెక్టర్ ప్రభావం మాత్రమే. అందుకే అనసూయ ఎక్కడ కనిపించినా కూడా.. ఇప్పటికీ రంగస్థలం రంగమ్మత్త అంటారు. అత్తా అని పిలవొద్దు అంటారు అనసూయ. మరి ఏమని పిలవాలో.. అలా ఎందుకు పిలవకూడదో కూడా అనసూయ సెలవిస్తే బాగుంటుందనేది విమర్శకుల మాట.

