ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరుకు పెద్దగా ప్రచారం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం సహా ఎన్నో భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ బాలు పాటకు ఓ ప్రత్యేకత ఉంది. కేంద్రం కూడా ఎస్పీబీని 2001లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2020 ఆగస్టు 5న ఎస్పీబీ కోవిడ్ చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబరు 25న బాలు తుదిశ్వాస విడిచారు.
Also Read : కేంద్రానికి షాక్ ఇచ్చిన యాపిల్..!
1946లో నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో జన్మించిన బాలు.. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు. అప్పటి నుంచి బాలు పాటలేని సినిమా లేదు. బాలు కోసం రికార్డింగ్ కూడా వాయిదా వేశారు సంగీత దర్శకులు. బాలు స్వరానికి ప్రాంతాలకు అతీతంగా అభిమానులున్నారు. ఖండాంతరాల్లో కూడా బాలుకు ఇప్పటికీ అభిమానులున్నారు. అలాంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇప్పుడు.. మరణించిన ఐదేళ్ల తర్వాత ప్రాంతాలు అంటగడుతున్నారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారు. డిసెంబర్ 15న బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహ ఏర్పాటును కొంతమంది తెలంగాణ వాదం ముసుగులో అడ్డుకుంటున్నారు. బాలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి.. అక్కడే విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని వితండవాదం చేస్తున్నారు.
Also Read : షాకింగ్: ఐపిఎల్ కు స్టార్ ఆటగాడు గుడ్ బై..!
నిజానికి కళకు ప్రాంతీయ హద్దులు లేవు. ఇదే మాటను ఒక వర్గం చెబుతుంటే.. ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన అంశమని మరో వర్గం వింత వాదన చేస్తోంది. రవీంద్రభారతిలో కేవలం తెలంగాణ ప్రముఖుల విగ్రహాలే ఉండాలని ఉద్యమకారుడి ముసుగు వేసుకున్న పృద్వీరాజ్ వితండవాదం చేస్తున్నారు. తెలంగాణ గడ్డపైన గద్దర్, అందె శ్రీ వంటి మహానుభావులకు మాత్రమే గౌరవం దక్కాలని.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటులు, ఎస్పీబీ బంధువు శుభలేఖ సుధాకర్‌తో పృద్వీరాజ్ గొడవ పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
కళాకారులను ప్రాంతాలకు అతీతంగా చూడాలని శుభలేఖ సుధాకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా సరే.. పృద్వీరాజ్ మాత్రం దాడి చేసేందుకు యత్నించారు. కళలకు హద్దులేమిటన్న సుధాకర్ మాటను తప్పుబడ్డిన పృద్వీరాజ్.. గతంలో తెలంగాణ గీతం పాడేందుకు ఎస్పీ బాలు అంగీకరించలేదన్నారు. అందుకే ఇప్పుడు ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు చేసేందుకు అంగీకరించేది లేదన్నారు.
Also Read : వినసొంపుగా స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్.. ఈ సంక్రాంతికి..!
అయితే ఈ వ్యవహారంపై మరో వర్గం మాత్రం తమ ప్రశ్నలకు పృద్వీరాజ్ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ వంటి ప్రముఖుల విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయని గుర్తు చేశారు. ఇక జూబ్లీహిల్స్‌లో దాసరి నారాయణరావు, రామానాయుడు, ఎల్వీ ప్రసాద్ విగ్రహాలు ఉన్నాయని.. వారి విగ్రహాలకు లేని అభ్యంతరం ఎస్పీబీ విషయంలో ఎందుకు అని నిలదీస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని.. కళకు ప్రాంతాలు అంటగట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిసెంబర్ 15న విగ్రహావిష్కరణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

