ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో అవతల జరిగాయని వైసీపీ నేతలు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. కూటమి సర్కార్ పైన, ప్రధానంగా మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా వైసీపీ నేతలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. డీఎస్సీలో ఏదో జరిగిందని.. అవినీతి, అక్రమాలు జరిగిపోయాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. నిప్పు రాజేసి.. ఆ పొగ టీడీపీ నేతలను కమ్మేలా నానా పాట్లు పడుతున్నారు. ఈ వివాదంపై ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే పలువురు అధికారులు వివరణ ఇచ్చారు.
Also Read : వైభవ్ సూర్యవంశీ మాస్టర్ ప్లాన్..? టెస్ట్ క్రికెట్ కోసం స్పెషల్ ట్రైనింగ్..!
డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని.. పోస్టింగ్‌లలో భారీగా అవినీతి జరిగిందని.. కాబట్టి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ.. తక్షణమే రాజీనామా చేయాలనేది వైసీపీ నేతల ఆరోపణ. డీఎస్సీ అవకతవకలంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళనలో ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. అంతే తప్ప.. అసలైన అభ్యర్థులు ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే.. 70 ఏళ్ల బూచేపల్లి వెంకాయమ్మ కూడా టీచర్ పోస్టు రాలేదంటూ ధర్నాలు చేస్తున్నారు. అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారని అడిగితే మాత్రం.. “మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి” అంటున్నారు తప్ప.. ఎందుకు చేయాలని అడిగితే.. “ఏమో తెలియదు” అంటున్నారు.
అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, హడావుడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రయత్నంలో సగం కూడా టీడీపీ నేతలు చేయటం లేదనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మాట. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు అయితే.. “ఈ విషయం మాకు సంబంధం లేదు.” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కనీసం స్పందించటం లేదు. వైసీపీ చేస్తోంది నారా లోకేష్ మీద కదా.. కాబట్టి ఆ పార్టీ నేతలే సమాధానం చెబుతారులే.. అంటున్నారు తప్ప.. కూటమి సర్కార్ నిర్వహించిన మెగా డీఎస్సీ – 2025 అని కనీసం ప్రస్తావించటం లేదు.
Also Read : షాకింగ్ : హార్ముజ్ కోసం ట్రంప్ సంచలన నిర్ణయం..!
వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొడుతూ కర్నూలులో మెగా డీఎస్సీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు తప్ప.. కూటమి నేతలు కనీసం ఎక్కడా కనిపించలేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కనీసం ఒక్క సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోలేదు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో కూడా కనీసం ఒక్కసారి కూడా నేతలంతా కలిసి పని చేస్తున్న దాఖలాలు లేవు. ఏదో ఒకరిద్దరు నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి.. నాలుగు మాటలు అనేసి వెళ్లిపోతున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం.. కనీసం స్పందించటం లేదనేది వాస్తవం. పరిస్థితి ఇలాగే ఉంటే.. వైసీపీ నేతలు చెబుతున్న అబద్ధాలను ప్రజలు నిజమని నమ్మే అవకాశం ఉందనేది క్యాడర్ అభిప్రాయం.

