ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. మరో రెండు నెలల్లోనే స్థానిక పోరు మొదలయ్యే అవకాశాల నేపథ్యంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోటీకి సిద్ధం కావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే దాన్ని సంబంధిత ఇన్‌చార్జ్ వైఫల్యంగా పరిగణిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Also Read : ప్రిన్స్ బర్త్ డే స్పెషల్.. ‘రుద్ర’ ఫస్ట్ లుక్ అదుర్స్..!
స్థానిక ఎన్నికలపై కూటమి శిబిరాల్లో జరుగుతున్న చర్చల్లో ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. గ్రామస్థాయి పదవుల విషయంలో కూటమి పార్టీల మధ్యే పోటీ తీవ్రంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ వంటి పదవులకు రిజర్వేషన్లు ఖరారు కాక ముందే ఆశావహులు తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత తమకు అనుకూలమైన అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో సాగుతోంది. కొన్ని చోట్ల అయితే ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వకూడదనే ఆలోచన కూటమి నాయకుల్లో ఉందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో మరో ప్రచారం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నిస్తే కేసులు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదే నిజమైతే స్థానిక ఎన్నికల స్వేచ్ఛాయుత వాతావరణంపై తీవ్ర ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయిలో ఎన్నికలు అంటే కేవలం రాజకీయ పార్టీల పోటీ మాత్రమే కాదు.. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక ఆధిపత్యాలు అన్నీ కలిసిన వ్యవహారం.
Also Read : ఏఐ డీప్‌ఫేక్‌పై కేంద్రం కీలక నిర్ణయం..!
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఎవరికీ నామినేషన్లు వేయించబోమని ఆయన బహిరంగంగా చెప్పడంతో పాటు, కొందరు గ్రామాలు విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు వచ్చిన వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల వాతావరణంపై వేడిని మరింత పెంచాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా చెప్పిన విషయాలు ఒక ఎత్తయితే.. రాజకీయ నాయకులు బహిరంగంగా చెప్పకపోయినా గ్రామ స్థాయిలో అదే తరహా ఒత్తిళ్లపై ప్రచారం సాగుతోందన్నది మరో చర్చ.
ఈ మొత్తం వ్యవహారంలో మరో రాజకీయ వాదన తెరపైకి వస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితిని తాము కూడా ఎదుర్కునేలా చేస్తామని కొందరు నేతలు చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో తప్పు జరిగిందని ఆరోపిస్తే.. అదే తప్పును ఇప్పుడు పునరావృతం చేయడమే పరిష్కారమా..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ చేసిన తప్పునకు ప్రతీకారంగా మరో పార్టీ అదే పద్ధతిని అనుసరిస్తే.. చివరకు నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, ఎన్నికల వ్యవస్థ మాత్రమే.
స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది. ఓటు హక్కు, స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాన అవకాశాలు, భయరహిత వాతావరణం వంటి అంశాలు రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. అయితే గ్రామస్థాయిలో ఆధిపత్య పోరు పెరిగి, నామినేషన్ల దశలోనే ప్రత్యర్థులను వెనక్కి తగ్గించే ప్రయత్నాలు జరిగితే.. ఎన్నికలు నిర్వహించినా వాటి ప్రజాస్వామ్య విలువపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే రాజకీయ పోరాటంగా చూడటం సరిపోదు. ఎవరు నామినేషన్ వేయగలిగారు? ఎవరు స్వేచ్ఛగా ప్రచారం చేయగలిగారు? ఎవరు భయం లేకుండా ఓటు వేయగలిగారు? అన్నదే అసలు పరీక్షగా మారనుంది.
Also Read : షాకింగ్ : హార్ముజ్ కోసం ట్రంప్ సంచలన నిర్ణయం..!
స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అసలు పరీక్ష ప్రభుత్వానిదే. ఎన్నికల సంఘానిదే. పోలీసు వ్యవస్థదే. నామినేషన్ల దశలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించగలరా? ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు రక్షణ కల్పించగలరా? ప్రచారంలో హింసకు తావు లేకుండా చూడగలరా? పోలింగ్ రోజున ఓటర్లు భయపడకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితిని కల్పించగలరా? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో చిన్న గ్రామంలోని ఒక పంచాయతీ పదవి కోసం మొదలైన వివాదం.. వ్యక్తిగత, కుటుంబ, వర్గ రాజకీయాలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే నామినేషన్ల నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలో అప్రమత్తత అవసరం.
కూటమి అధికారంలో ఉండటం.. వైసీపీ ప్రతిపక్షంలో ఉండటం.. ఎవరి రాజకీయ బలం ఎంత అన్నది ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి. కానీ ఆ ఫలితాల కంటే ముందే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఏర్పడితే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతమే. స్థానిక ఎన్నికలు రాజకీయ యుద్ధంగా మారుతాయా? లేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆరోగ్యకరమైన పోటీగా సాగుతాయా? అన్నది రాబోయే రెండు నెలల్లో తేలనుంది. అధికార పక్షానికి అధికారం ఉంది. ప్రతిపక్షానికి పోరాటం తప్ప మరో మార్గం లేదు. కానీ ఎన్నికల సంఘానికి మాత్రం ఒక్కటే బాధ్యత ఉంది.. ఎవరి పక్షానా కాకుండా, ఎన్నికల పక్షాన నిలబడటం. స్థానిక పోరు నిజంగా రణరంగంగా మారకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలపైనే ఉంది.

