ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద కేసు నమోదయ్యింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ వారణాసి వస్తోంది. ఈ సినిమా ఈవెంట్‌ను ఈ నెల 15న రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్‌గా నిర్వహించారు. గ్లోబ్ ట్రోటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు సినిమా గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Also Read : చేతులు మారుతున్న ఆర్సీబీ..!
వారణాసి సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్‌లో రాజమౌళి కొంత అసహనానికి గురయ్యారు. 130 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకున్న జక్కన్న.. సినిమా ట్రైలర్‌ను ముందే చూసుకుందామనుకునే సమయంలో డ్రోన్‌తో కవర్ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీంతో ముందుగా చూడలేకపోయామన్నారు. అయితే నేరుగా ఈవెంట్‌లో టైటిల్ ట్రైలర్ ప్లే చేస్తున్నామని ప్రకటించారు. ఆ సమయంలో కొతంత టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఓ పది నిమిషాల్లో టైటిల్ అనౌన్స్ చేస్తామన్నారు జక్కన్న.
Also Read : మన్యంలో తుపాకీ మోత.. అగ్రనేత హిడ్మా హతం..!
పది నిమిషాల తర్వాత ట్రైలర్ ప్లే చేయగా.. అది ఆగిపోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజమౌళి.. తనకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు. ఆ సమయంలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. తనతో హనుమంతుడే వెనకుండి నడిపిస్తాడు.. అని చెప్పారన్నారు. తన భార్య రమా రాజమౌళికి హనుమంతుడు అంటే చాలా ఇష్టమని.. స్నేహితుడిలా భావిస్తారని.. ఆయనతో ఆమె రోజూ మాట్లాడుతుందని కూడా రాజమౌళి చెప్పారు. అలాంటి హనుమంతుడు ఇలానేనా చేసేది అని అనిపించింది.. అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి.
Also Read : భారత్ లో హమాస్ తరహా దాడులకు ప్లాన్..?
రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజమౌళిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వానర సేన సంఘం సభ్యులు హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా మీడియాలో వచ్చిన కొన్ని క్లిప్‌లను తమ ఫిర్యాదుకు జత చేసినట్లు వెల్లడించారు. ఆంజనేయ స్వామిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యల పట్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎవరూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరికి కఠిన శిక్షపడితే మరొకరు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడతారని వానసేన సంఘం సభ్యులు హెచ్చరిస్తున్నారు.

