తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సింపుల్‌గా ముగిసింది. రాజ్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న మూడు బెర్తుల్లో ఒకటి పూర్తి చేశారు. ఇంకా రేవంత్ క్యాబినెట్‌లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు.. ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని తొలి నుంచి కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడినట్లు అయ్యింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదిపిన రేవంత్.. మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసుకుని ముందుగా అజారుద్దీన్‌ను మంత్రిని చేశారు. ఇదే ఇప్పుడు పార్టీలో కొందరు సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.
Also Read : ఆ విషయంలో మీనమేషాలు లెక్కేస్తున్న అధినేత..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి పదవి మీద గంపెడంత ఆశలు పెట్టుకున్న వారిలో మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే రేవంత్ సర్కార్ పైన విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లో సీనియర్ అని.. తనకు మంత్రి పదవి ఇస్తాననే హామీతోనే బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు కూడా వ్యాఖ్యానించారు. ఒకే ఇంటికి రెండు మంత్రి పదవులిస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. అదే సమయంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి, తొలిసారి ఎన్నికైన వారికి మంత్రిపదవులు ఎలా ఇస్తారని కూడా నిలదీశారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ బెదిరించారు కూడా.
Also Read : అజారుద్దీన్ శాఖ అదేనా..? కానీ మరో అడ్డంకి కూడా..?
తాజాగా అజారుద్ధీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై గుర్రుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. తన అనుచరులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని దసరా పండుగకు ముందే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబితే.,. సరిగ్గా నెల రోజుల్లోనే ఇప్పుడు అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవడంపై రాజగోపాల్ గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు పదవులు ఇచ్చిన రేవంంత్.. క్యాబినేట్ హోదా కల్పించారు. సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలను అప్పగించారు. ఇక ప్రేమ్ సాగర్ రావును పౌరసరఫరాల శాఖ చైర్మన్ పదవి కేటాయించారు. దీంతో వీరిద్దరు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తన పేరును కనీసం పరిశీలించలేదని తెలిసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాజాగా తన వర్గం ముఖ్యనేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉండటంతో పాటు రేసులో సీనియర్లు కూడా లేకపోవడంతో కొద్ది రోజులు ఆగుదామనే సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రి పదవి రాకపోతే రేవంత్ సర్కార్‌పై ప్రత్యక్ష యుద్ధం చేసేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమైనట్లే ఉన్నారు.

