కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇప్పటికే ఏపీలో ఉన్న 26 జిల్లాలు ఈ రెండు జిల్లాలతో కలిపి 28కి చేరనున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయనుంది కూటమి సర్కార్. ఇదే సమయంలో కొన్ని జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి మరో జిల్లాలో విలీనం చేయనుంది. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియకు తుది రూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read : శభాష్.. క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టిన అధికారులు.. బలవంతంగా అయినా సరే
ఏపీలో జిల్లాల సంఖ్య పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాలను వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసింది. అలాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండుగా విభజన చేసింది. అయితే ఈ విభజనపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని జిల్లాల ఏర్పాటు పూర్తిగా అసంబద్ధమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నైసర్గికంగా విభజన సరిగ్గా లేదని కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అయినా సరే.. జగన్ సర్కార్ మాత్రం ప్రజల అభిప్రాయాన్ని ఏ మాత్రం లెక్క చేయలేదు.
ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలతో పాటు 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. వీటిల్లో కొన్ని జిల్లా కేంద్రాలకు దూరంగా ఉంటే.. మరికొన్ని మాత్రం.. నైసర్గికంగా మరింత వెనుకబాటుకు గురయ్యాయి. 2019 ఎన్నికల సమయంలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. పైగా అది సాధ్యం కాదని తేల్చేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మార్కాపురం జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘం కూడా మార్కాపురం జిల్లాతో పాటు ఏపీలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లెను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదన చేసింది. ఇదే సమయంలో పోలవరం ముంపు మండలాలను ఏం చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : సూపర్.. దుమ్ము రేపారు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్..!
ముఖ్యమంత్రితో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం.. అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని సూచించింది. అలాగే 86 మండలాలను కొత్త డివిజన్లుగా, జిల్లాల వారీగా పునర్ వ్యవస్థీకరించాలని సూచించారు. 4 రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదన చేశారు. వీటిపై నవంబర్ 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. తుది రూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

