దక్షిణాదిలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా కృషి చేస్తోంది. కర్ణాటకలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా రాణించటం లేదు. కేరళలో పార్టీకి నేతలే కరువయ్యారు. తమిళనాడులో మాత్రం తమిళి సై వంటి నేతల వల్ల పార్టీ గురించి జనం చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. తెలంగాణలో అయితే బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గట్టిగానే ప్రయత్నం చేసినప్పటికీ.. కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 8 స్థానాలు గెలుచుకుంది టీ బీజేపీ. ఇక ఏపీలో కూడా గత ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కూటమిలో చేరడం వల్ల 8 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. అయితే గత డిసెంబర్ నుంచి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read : డి లిమిటేషన్ పై రేవంత్ కీలక అడుగు
సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణలో అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం మార్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన బండి సంజయ్‌ను పక్కకు తప్పించిన ఢిల్లీ పెద్దలు… ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించారు. ఇక ఎన్నికల వరకు పార్టీని నడిపించిన కిషన్ రెడ్డి సారధ్యంలో కేవలం 8 స్థానాలు గెలిచింది. టికెట్లు కేటాయింపుతో పాటు పార్టీలో గ్రూప్ తగాదాలను కిషన్ రెడ్డి పెంచిపోషించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇక ప్రచారం విషయంలో కిషన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి హేమాహేమీలు కూడా ఓడిపోయారు. దీంతో తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పెద్దలు ఎక్కువగా ఫోకస్ చేశారు. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 స్థానాలు గెలుచుకుంది. అలాగే రెండు కేంద్ర మంత్రిపదవులు కూడా దక్కాయి. అయితే ఈ ఏడాది జూన్ నాటికి కిషన్ రెడ్డి రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిని తప్పిస్తారనే పుకార్లు ఎప్పటి నుంచో షికారు చేస్తున్నాయి. ఆయన స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావిస్తున్నారు. కానీ వాటికి అధిష్టానం చెక్ పెట్టింది.
Also Read : వైసీపీకి గ్రోక్ షాక్.. ఏం చెప్పిందంటే..
ఇక ఇటు ఏపీలో కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరిని తప్పిస్తారనే మాట ఎన్నికల నాటి నుంచి వినిపిస్తోంది. 2023 జూలై నెలలో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి సారధ్యంలోనే ఏపీలో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అయితే కూటమి సర్కార్ పెద్దల కంట్రోల్‌లో పురంధేశ్వరి ఉన్నారని పార్టీలోని ఓ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు కూడా. ఏపీ బీజేపీ అధ్యక్ష కుర్చీ కోసం విష్ణువర్థన్ రెడ్డి, జీవీఎల్ వంటి నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే అధ్యక్షుల మార్పుపై ఢిల్లీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు. మరో ఏడాది పాటు అధ్యక్షుల మార్పు లేదని తేల్చేశారు. ఏపీలో పురంధేశ్వరి, తెలంగాణలో కిషన్ రెడ్డి మరో ఏడాది కొనసాగుతారని స్పష్టం చేశారు ఢిల్లీ పెద్దలు. దీంతో అధ్యక్ష పీఠం ఆశించిన వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

