దేశంలో ఎన్నికల నిర్వహణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజానికి చెందిన పలువురు వ్యక్తులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల లెక్కలే ఇప్పుడు చర్చకు కేంద్రంగా మారాయి. ప్రత్యేకంగా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదైనట్లు వెల్లడైన వివరాలపై వివరణ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలింగ్ సమయానికి సంబంధించిన గణాంకాలు, అనంతరం నమోదైన ఓట్ల సంఖ్యపై స్పష్టత అవసరమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : బరువు తగ్గాలంటే అన్నం మానేయకూడదా..?
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సాధారణ సమయం దాటిన తర్వాత కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగింది. కొన్ని వేల పోలింగ్ కేంద్రాల్లో రాత్రి ఆలస్యంగా పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు సూచిస్తున్నాయని ఎన్నికల ప్రక్రియపై విమర్శలు చేస్తున్నవారు గుర్తు చేస్తున్నారు. ఇదే అంశాన్ని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మూడు సెకన్లకు ఒక ఓటు చొప్పున నమోదైనట్లుగా కనిపించే కొన్ని గణాంకాలపై ఆయన ప్రశ్నలు సంధిస్తున్నారు. తెల్లవారుజామున వరకు కొనసాగిన పోలింగ్‌లో తక్కువ వ్యవధిలో భారీ సంఖ్యలో ఓట్లు ఎలా నమోదయ్యాయన్నదే ఆయన ప్రధాన ప్రశ్న. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత నమోదైన ఓట్ల సంఖ్యపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గణాంకాలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇస్తేనే ప్రజల్లో ఉన్న సందేహాలకు తెరపడుతుందని ఇప్పుడు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తనకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఏపీ ఎన్నికలపై తాను పరిశోధన చేస్తున్నానని, త్వరలో మరిన్ని వివరాలతో మాట్లాడతానంటూ ప్రకాష్ వెల్లడించారు. దీంతో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై ఉన్న రాజకీయ చర్చకు మరో కోణం చేరింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఘోర పరాజయం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో ఏదో జరిగిందనే అనుమానం ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద లేవన్నారు. ఈ మాట అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!
ఆ తర్వాత వైసీపీ నేతలు ఈవీఎంలపై అనేక ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు సరైన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలింది. ఎన్నికల గణాంకాల్లో కనిపిస్తున్న వ్యత్యాసాలకు పూర్తి వివరణ ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఇదే సమయంలో కూటమి నేతలు కూడా వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కూడా ఈవీఎంల వల్లేనా.. అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కూడా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అర్థరాత్రి వరకు క్యూ లైన్‌లో ఓటింగ్ ఎలా జరిగిందని నిలదీస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘంపై ప్రజలకు ఉండే నమ్మకమే అత్యంత కీలకం. అందుకే ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనా వాటిని రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయడం కంటే.. గణాంకాలతో, అధికారిక వివరాలతో సమాధానం ఇవ్వడం అవసరం. పోలింగ్ ముగిసిన తర్వాత నమోదైన ఓట్ల సంఖ్య, ఆలస్యంగా కొనసాగిన పోలింగ్, వివిధ దశల్లో వెల్లడైన గణాంకాల మధ్య తేడాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని విమర్శకులు కోరుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఓట్లను మార్చిందని లేదా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని చెప్పడానికి సరైన ఆధారాలు అవసరం.
Also Read : అమరావతిలో కేటీఆర్ టీమ్ భారీ పెట్టుబడులు..?
గతంలో ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో ఓటర్లు నిర్ణయించేవారు. ఏపీ ఎన్నికల గణాంకాలపై ప్రశ్నలు ఉంటే వాటికి పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి. అదే సమయంలో ఆరోపణలు చేస్తున్నవారు కూడా తమ వాదనలకు ఆధారాలను సమర్పించాలి. ఎన్నికలపై ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి పునాది. ఆ విశ్వాసంపై చిన్న సందేహం వచ్చినా.. దానికి పారదర్శకమైన సమాధానమే పరిష్కారం. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? లేక గణాంకాలను తప్పుగా అర్థం చేసుకోవడమేనా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రావాల్సిందే. అదే ప్రజాస్వామ్యానికి అసలైన విజయం.


