భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా కొనసాగుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ (37) తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఆమె తాను టెస్టులు, వన్డేలు, టీ20 జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడలలో భారత జట్టుకు ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ అందించిన కొద్దిరోజులకే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read : ఏపీ ఎన్నికల పైనే ఎందుకింత అనుమానం..?
జట్టు ప్రదర్శనపై గువాహటిలో జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ ముగిసిన వెంటనే హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశానికి హెడ్ కోచ్ అమోల్ ముజుందార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక సుదీర్ఘ భావోద్వేగ నోట్ రాసుకొచ్చింది. “ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు దీని వెనుక ఉన్నాయి.

ఒక లీడర్‌గా నా బాధ్యతను నేను సక్రమంగా పూర్తి చేశానని నమ్ముతున్నాను. నా జట్టు ప్రస్తుతం సురక్షితమైన, మంచి స్థితిలో ఉంది. అందుకే కెప్టెన్సీ భారాన్ని పక్కనబెట్టి, ఇకపై కేవలం ఆటపై ఉన్న ప్రేమతో ఒక ప్లేయర్‌గా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. కెప్టెన్సీ ముగిసినా, ప్రయాణం కొనసాగుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. భారత మహిళల క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించింది హర్మన్‌ప్రీత్ కౌర్. 2016 లో ఆమె మొదటిసారి భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టగా.. ఆ తర్వాత 2022లో వన్డే జట్టుకు, 2023 నాటికి అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్ గా ఎంపికైంది.
Also Read : చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ రీజన్ ఇదేనా..?
ఆమె నేతృత్వంలో భారత జట్టు 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20 మ్యాచ్‌లు ఆడింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు మొట్టమొదటి అంతర్జాతీయ ఐసీసీ గ్లోబల్ టైటిల్‌ను అందించడమే కాకుండా, ఆసియా క్రీడల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణ పతకాలు సాధించి తిరుగులేని రికార్డు తన ఖాతాలో వేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో ఇప్పుడు టీమిండియా తదుపరి మహిళా కెప్టెన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే చాలా కాలంగా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉంటూ, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించనుంది.


