తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న మంత్రివర్గ విస్తరణ అంశం ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారడంతో, ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేపు, అనగా ఆదివారం నాడే నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసినట్లు సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది.
Also Read : కృష్ణా జలాల పంచాయతీ.. అసలు వాటా ఎంత..?
ప్రస్తుత క్యాబినెట్‌లో మొత్తం 18 మంది మంత్రులకు ఛాన్స్ ఉండగా, ప్రస్తుతం మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ మంత్రి పదవుల రేసులో ప్రధానంగా నలుగురు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ది కాగా, ఆయనకు ఇప్పటికే బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో 15వ నంబర్ క్వార్టర్‌ను కూడా కేటాయించారనే లీకులు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
వీరితో పాటు సీనియర్ నాయకురాలు, సినీ నటి విజయశాంతికి కూడా క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆయన స్థానంలో మరొకరిని స్పీకర్‌గా నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఈసారి మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : పేపర్ మిల్లు మూసేస్తారా.. లేదా..?
సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ బీసీ, ఎస్సీ, ఓసీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా ముఖ్యమంత్రి ఈ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖ తొలగింపు తర్వాత వెనుకబడిన తరగతుల ఓటర్లలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు గానూ, మహిళా కోటాతో పాటు బీసీ సమీకరణాల కింద విజయశాంతి, మహేష్ కుమార్ గౌడ్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి రేపు జరగబోయే ఈ విస్తరణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మార్పుగా నిలవనుంది. అయితే ఈ నలుగురిలో ఏ ముగ్గురు నేతలు రేపు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది.

