“సార్.. జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాను. మీ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటాను” అంటూ మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన పదో తరగతి విద్యార్థిని శివాని.. ఇప్పుడు విగతజీవిగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో, చదువులో రాణించాలన్న పట్టుదలతో కనిపించిన ఆ బాలిక అర్దాంతరంగా తనువు చాలించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు రంపచోడవరం పర్యటన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శివాని అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి ఎదుట ఎలాంటి బెరుకు లేకుండా చలాకీగా మాట్లాడింది. జీవితంలో ఏదైనా సాధిస్తానని, ఉన్నత స్థాయికి చేరుకుని ఆయన చేతుల మీదుగానే పురస్కారం అందుకుంటానని చెప్పింది.
Also Read : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా..!
ఆమె ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు శివానితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆమెతో కలిసి భోజనం చేసి, జ్ఞాపకంగా పక్కన కూర్చొబెట్టుకుని ఫోటోలు కూడా దిగారు. భవిష్యత్తులో తాను సాధించే విజయాల గురించి తనకు తెలియజేయాలని ప్రోత్సహించారు. అంత ఉత్సాహంగా కనిపించిన శివాని మూడు ఎ రోజుల వ్యవధిలోనే ప్రాణాలు తీసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె రాసినట్లుగా చెబుతున్న చివరి లేఖలోని మాటలు మరింత కలచివేస్తున్నాయి. తల్లిదండ్రుల కోసం ఎంతో కష్టపడాలని, వారు కలలుగన్న జీవితాన్ని అందించాలని అనుకున్నానని, అయితే తాను అనుకున్నది చేయలేకపోతున్నానని అందులో పేర్కొన్నట్లు సమాచారం. బతకాలని ఉన్నప్పటికీ తనలోని బాధను భరించడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి ఉండాలన్న ఆకాంక్షను కూడా శివాని తన చివరి లేఖలో వ్యక్తం చేసినట్లు సమాచారం. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఎప్పటికైనా కలవాలని కోరినట్లు తెలుస్తోంది. కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు ఆ చిన్నారి మనసుపై ఎంతటి ప్రభావం చూపాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే శివాని మృతికి దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి ఎదుట నిలబడి భవిష్యత్తుపై ఎన్నో కలలను పంచుకున్న బాలిక.. ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది. ముఖ్యమంత్రి ఎదుట ధైర్యంగా మాట్లాడిన ఆమె మాటలు, ఆయనతో కలిసి భోజనం చేసిన క్షణాలు ఇప్పుడు విషాద జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఉన్నతంగా ఎదగాలనుకుంది.. తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలనుకుంది.. సాధించిన విజయానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోవాలని కలగన్నది. కానీ ఆ కలలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. మూడు రోజుల కిందట అందరి ముందూ చిరునవ్వులు చిందించిన శివాని.. ఇప్పుడు ఓ విషాద జ్ఞాపకంగా మిగిలింది.
Also Read : మోదీ మార్క్ సరికొత్త రాజకీయం..!
శివాని మృతిపై చంద్రబాబు చలించిపోయారు. “పదవ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకు లోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము.” అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

