ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో రాజకీయ వేడి పీక్ స్టేజ్‌కు చేరింది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగడం, స్థానిక పోలీసుల తీరుపై గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది.
Also Read : మున్సిపల్ పోరు వేళ హింసకు వైకాపా కుట్ర..?
ఎన్నికల వేళ ఏ చిన్న ఉద్రిక్తతకూ తావులేకుండా ఉండేందుకు కడప, పులివెందుల కేంద్రాలుగా ఖాకీ బలగాలు భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశాయి. నామినేషన్ల ప్రక్రియ నుంచే పులివెందుల, కడప ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో, ఈసారి మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. దీనిపై కర్నూలు రేంజ్ డీఐజీ డీఆర్. కోయ ప్రవీణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల సమయం నాటి ఘర్షణల దృష్ట్యా తాము కడప, పులివెందులపై గట్టి నిఘా ఉంచామని తెలిపారు.
Also Read : మిథున్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
పోలింగ్ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనే పక్కా సమాచారం తమకు ఉందని డీఐజీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్ నుంచి అదనపు పోలీసు బలగాలను భారీగా కడపకు తరలిస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పోలింగ్ రోజున శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అపూర్వమైన ఆంక్షలను విధిస్తున్నారు. అందులో భాగంగానే పోలింగ్ రోజున పులివెందుల పట్టణానికి కనెక్ట్ అయ్యే సుమారు 17 ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేయనున్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల నుంచి అల్లరి మూకలు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


