తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు కూడా. అయితే ఇలాంటి సమయంలో ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థ అంటూ కొందరిని నియమించడం ఏమిటనే చర్చ మొద లైంది. వివిధ శాఖలకు డజన్ మంది సలహాదారులు నియమితులయ్యారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది పాత్ర ఏమిటన్నది అధికార వర్గాలకు కూడా ఇప్పుడు అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు. సాధారణంగా ప్రభుత్వ సలహాదారుల బాధ్యతలంటే సంబంధిత శాఖలకు విధానపరమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది. సీఎంకు అవసరమైన సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరిపాలనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వ సలహాదారులు ఇవేమీ చేసినట్టు కనిపించడమే లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: గోపాలన్న కల ఈసారైనా తీరుతుందా..?
రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యాక ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారని ఆశావహులు ఎదురు చూసినా, అలాంటిది ఇప్పటి వరకు జరగలేదు.
ఇక కాంగ్రెస్ హై కమాండ్‌కు నమ్మకమైన వ్యక్తిగా ఉన్న వి.హనుమంతరావు.. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా రాష్ట్ర మంత్రి హోదాలో నియమితులయ్యారు. సమావేశాలు, సమీక్షలు, అధికారులతో చర్చలతో ఎప్పుడూ చురుకుగా ఉండటమే కాదు.. వార్తల్లో కూడా ఉంటున్నారు. మిగిలిన సలహాదారులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వారికి అప్పగించిన బాధ్యతలకు ఏ మేరకు న్యాయం చేస్తున్నారన్నదానిపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత మేరకు ఉపయోగపడుతున్నారనే అంశాలపై స్పష్టత కనిపించడం లేదు. అదే ఇప్పుడు అధికార, పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది.
Also Read : భాగ్యనగరం.. ఒక్క వర్షం.. ఎన్నో ప్రశ్నలు.. గుణపాఠాలేవి..?
అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తుంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడమే గగనంగా మారిందని ముఖ్యమంత్రి పలుమార్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల్లో తీవ్రంగా జాప్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విదేశీ విద్యా స్కాలర్‌షిప్‌ల విడుదల అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో విపరీతమైన తాత్సారం జరుగుతుంది. ఈ విషయమై కాంట్రాక్టర్లే పలుమార్లు ఆందోళన చేపట్టారు. ఏకంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చాంబర్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. నిధుల కొరతతో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి బిల్లులకు చెల్లింపులు చేస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారులకు అందుతున్న సౌకర్యాలపై కూడా చర్చ జరుగుతుంది. సలహాదారులకు నెలవారీ వేతనాలతో పాటు ఇంటి అద్దె భత్యం, వాహన సౌకర్యం, డ్రైవర్లు, కార్యాలయ సిబ్బంది, సచివాలయంలో ప్రత్యేక ఛాంబర్లు, ఇతర పరిపాలనా వసతులు కల్పించారు. కొందరికి కేబినెట్ మంత్రి హోదా ఇచ్చారు. ప్రజాధనంతో కొనసాగుతున్న సలహాదారుల వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ప్రయోజనాలేమిటన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడమే లేదు. సీనియర్ నేతలను సలహాదారులుగా నియమించుకోవడం ద్వారా వారి అనుభవాన్ని పాలనలో వినియోగించుకోవచ్చనేది ప్రభుత్వాలు చెబుతున్న మాట. ఆ అనుభవం ప్రజలకు ఉపయోగపడాలి. అలా లేనపుడు రాజకీయ పునరావాసం కల్పించడం కోసమే అనే విమర్శ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

