అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో కూటమి పార్టీల మధ్య క్లారిటీ వచ్చేసింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెండు స్థానాలను ఇప్పటికే బీజేపీకి కేటాయించారు. కాబట్టి ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం లేదని టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు తేల్చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించారు. మిగిలిన 3 స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో ఏపీ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : అసలు పెద్ద సారు ఏమయ్యారు..?
2024 – 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించడమైందనే జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైందన్నారు. నాలుగు స్థానాల్లో ఒక స్థానం జనసేనకు కేటాయించగా.. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల మధ్య స్థానాలపై చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో సర్దుబాటుల్లో భాగంగా జనసేన పోటీ చేయవలసిన లోక్‌సభ స్థానాలను త్యాగం చేసిందని.. లోక్‌సభ స్థానాలు త్యాగం చేసిన క్రమంలో రాజ్యసభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగిందని జనసేన నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రాజ్యసభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కింది.
అయితే రాజ్యసభ అభర్థి ఎంపిక పవన్ కళ్యాణ్‌కు అగ్నిపరీక్షే అంటున్నారు విశ్లేషకులు. పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ తాను ఆరో తేదీన నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా కమ్మ కులం వారికా.. లేక కాపు కులం వారికా.. అనే చర్చ మొదలైంది. చంద్రబాబుపై అసంతృప్తిగా, వ్యతిరేకంగా ఉన్న కమ్మ కులం ఓటర్ల అభిమానం పొందాలంటే,, ఆ కులానికే చెందిన వ్యక్తిని రాజ్యసభకు ఎంపిక చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో కాపు కులంలో కొంత పట్టు కోల్పోతున్న నేపథ్యంలో.. ఆ కులానికి చెందిన వ్యక్తినే, రాజ్యసభ అభర్థిగా ఎంపిక చేస్తే బాగుంటుందని జనసేన కాపు కులం నేతల అభిప్రాయం.
Also Read : ఏపిలో దూకుడు పెంచిన పవన్..!
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా కాపు కులం నేతనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాను నామినేషన్ వేస్తున్నట్లు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడుగా ప్రచారం ఉన్న లింగమనేని రమేష్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు కాపు కులం వారికే రాజ్యసభ ఇస్తున్నట్లు పవన్ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పవన్‌పైన కాపు సామాజిక వర్గం పెద్దల ముసుగులో కొందరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వాటికి చెక్ పెట్టాలంటే.. రాజ్యసభకు జనసేన తరఫున కాపు నేతను పంపడమే సరైన నిర్ణయం అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాపు కులానికి చెందిన వ్యక్తినే రాజ్యసభకు పవన్ కళ్యాణ్ ఎంపిక చేయటం ఖాయం అని జనసేన నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన తరఫున నామినేషన్ వేస్తున్నట్లు లింగంనేని రమేష్ తన సన్నిహితులతో చెప్పడం కలకలం రేపుతోంది. లింగమనేని ధీమాకు కారణమేమిటనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇప్పటికే టార్గెట్ జనసేన అన్నట్లుగా కొందరు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ అభ్యర్థి ఎంపిక.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అగ్ని పరీక్షే..!

