ఏపీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ తగ్గుతుందా..? వచ్చే నెల నుంచి వృద్ధాప్య పెన్షన్ రూ. 4 వేలకు బదులుగా రూ.3,800 మాత్రమే ఇస్తారా..? దివ్యాంగ పెన్షన్ రూ.6 వేలకు బదులుగా రూ.5,500 మాత్రమే ఇస్తారా..? పెన్షన్లు తగ్గిస్తున్నారనే అనుమానం ఇప్పుడు చాలా మందిలో ఉంది. వృద్ధాప్య పెన్షన్‌లో రూ.200, దివ్యాంగ పెన్షన్‌లో రూ.500 కోత పెడుతున్నారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ప్రభుత్వ పెద్దలు. నిజానికి కోత నిజమే కానీ.. కోత పెట్టిన మొత్తం కూడా నేరుగా లబ్దిదారులకే చెల్లించనున్నారు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సర్దుబాటు మాత్రమే అని చెబుతున్నారు.
Also Read : చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లిస్ట్..? మున్సిపల్ ఎన్నికల ముందే..!
ప్రతినెలా వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ వాటా కూడా కొంత ఉంటుంది. ఈ రెండు వాటాలను కలిపి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వమే సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారులకు నగదు రూపంలో అందిస్తోంది. అయితే వచ్చే నవంబర్ ఒకటో తేదీ నుంచి మాత్రం.. ఎవరి వాటాలు వారు వేరు వేరుగా.. లబ్దిదారులకు నేరుగా అందించనున్నారు. ఇందులో కేంద్రం తన వాటను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి నెల మాదిరిగా తన వాటను మాత్రం నగదు రూపంలో నేరుగా లబ్దిదారులకు అందించనుంది. అయితే పెన్షన్ కేటగిరిని బట్టి వాటా మారుతుంది.
Also Read : ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై నెట్‌వర్క్ సంచలనం..!
నిజానికి ఈ ప్రక్రియ ఇప్పటికే ఏపీలోని విజయనగరం జిల్లాలో రెండు నెలల క్రితమే ప్రారంభమైంది. గజపతినగరం మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద 1919 మంది లబ్దిదారులకు రెండంచెలుగా పెన్షన్లు అందజేస్తున్నారు. వచ్చే నవంబర్ ఒకటి నుంచి రాష్ట్రమంతా ఈ తరహాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల కోసం ఎన్‌టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 61.8 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 9.5 లక్షల మంది మాత్రమే కేంద్రం అమలు చేస్తున్న జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం.. ఎన్ఎస్ఏపీ పథకం పరిధిలోకి వస్తున్నారు. అందువల్ల వీరికి మాత్రమే కేంద్రం వాటా బ్యాంకు అకౌంటులో జమ అవుతుంది.
Also Read : కాళేశ్వరం పై సీబీఐ గురి.. టార్గెట్ కేసీఆర్..!
కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు రెండు విధాలుగా ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తున్నది. 60 — 79 ఏళ్ల మధ్య వయసు వారికి రూ.200, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.500 నేరుగా వారి ఖాతాల్లో వేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నగదు రూపంలో ఇస్తుంది. అయితే పెన్షన్ సొమ్మును ఇప్పటి వరకు కలిపి ఇవ్వటం వల్ల లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడదీసి ఇవ్వడం వల్ల లబ్దిదారుల్లో గందరగోళం రావడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న విధానం అందరికీ సౌకర్యంగా ఉందని.. దీనిని మార్చడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ఇలా వేరు వేరుగా ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం అందిస్తున్న నిధులు నెలల తరబడి రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లో వృధాగా ఉంటున్నాయని.. అలాగే నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారనేది కేంద్ర ప్రభుత్వ ఆరోపణ. దీని వల్ల ఆశించిన ప్రయోజనం రావటం లేదని.. అందుకే ఇలా వేరు వేరుగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చే పెన్షన్ వాటా సొమ్ము లబ్దిదారుల అకౌంట్‌లో జమ కావాలంటే.. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి. అలా చేయకపోతే కేంద్ర వాటా సొమ్ము జమ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర నిధుల పంపిణీలో దళారీ వ్యవస్థను నిర్మూలించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం. దీనివల్ల కేంద్రం నుంచి ఎంత సహాయం అందుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఇస్తోంది అనే అంశంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.


