ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో ఒక కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం అందుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల పొత్తును మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయవంతంగా కొనసాగించేలా కూటమి పార్టీలు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల పొత్తులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుకు అందించినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో తాగునీటి విప్లవం.. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ!
జనసేన బలంగా ఉన్న స్థానాలు, గెలుపు గుర్రాలు ఎక్కువగా ఉండే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వివరాలను ఈ లిస్ట్‌లో పొందుపరిచినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్థానాల జాబితాపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరోవైపు కూటమిలోని మూడు పార్టీల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ ఈ సీట్ల సర్దుబాటుపై స్పష్టత రావాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నట్లు పవన్ తెలిపినట్లు సమాచారం.
Also Read : కళ తప్పిన అయోధ్య.. యూపీ ఎన్నికలపై ప్రభావం..!
ఇందులో భాగంగానే సమన్వయ కమిటీలో కూడా జనసేన, బీజేపీ ప్రతినిధుల నుంచి వారు పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న తెలుగుదేశం పార్టీ, సీట్ల సర్దుబాటులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తోంది. అందువల్ల ఆయా నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, జనసేన మరియు బీజేపీ ప్రతినిధులు తమకు పట్టున్న, బలంగా ఉన్న స్థానాల వివరాలను ముందుగా ఇవ్వాలని టీడీపీ కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈ పరిణామాలతో ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందడి అప్పుడే మొదలైందని చెప్పవచ్చు.


