ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఇంటికీ ఆధునిక పైప్‌లైన్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తూ, గ్రామీణ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఈ మిషన్ కొత్త ఊపిరి పోస్తోంది. క్షేత్రస్థాయిలో నాణ్యమైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో జల భద్రత క్రమంగా సాకారమవుతోంది.
Also Read : చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ రీజన్ ఇదేనా..?
అయితే, గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపులో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం, పెండింగ్ బకాయిలు, నిలిచిపోయిన ప్రాజెక్టులు తాగునీటి రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. గత ఐదేళ్ల పాలనలో కేంద్రం ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్లను సరిగ్గా వినియోగించకపోవడం వల్ల కోట్లాది రూపాయల బిల్లులు నిలిచిపోయాయి. దీంతో పనులు చేపట్టిన చిన్న, మధ్య తరహా స్థానిక కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని అప్పులపాలయ్యారు, అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి.
ఈ వైఫల్యాల వల్ల ముఖ్యంగా తీవ్ర నీటి ఎద్దడి ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా దారుణంగా దెబ్బతిన్నాయి. ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు వంటి ప్రాంతాల్లో మల్టీ విలేజ్ స్కీమ్స్ నిలిచిపోవడంతో ప్రజలు దశాబ్దాల కాలం నాటి తాగునీటి కష్టాలనే మళ్లీ అనుభవించాల్సి వచ్చింది. రాయలసీమలోని సుదూర గ్రామాలకు కృష్ణా, తుంగభద్ర జలాలను చేరవేసే కీలక ప్రాజెక్టుల విస్తరణ మందగించడంతో వేలాది గ్రామాలు నీటి కోసం అల్లాడిపోయాయి.
Also Read : విజయనగరం టీడీపీలో విచిత్ర పరిస్థితి.. తమ్ముళ్ల మైండ్ బ్లాక్..!
ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టి సారించి నిధులు విడుదల చేయడం, పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. ఈ కొత్త ఊపుతో ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల్లో సురక్షిత నీరు అందడమే కాకుండా స్థానిక కాంట్రాక్టర్లు, కార్మికులకు మళ్లీ ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.


