తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడీగా మారాయి. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ దూకుడుకు బీఆర్ఎస్ కళ్లెం వేయలేకపోతోంది. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు దూకుడుగా వ్యవహరించిన కారు పార్టీ నేతలు నోటికే ఎక్కువగా పని చెప్పారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో లెక్కలేనంత అవినీతికి పాల్పడారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచేశారని.. ఫార్మూలా ఈ కార్ రేసులో అవినీతి ఆరోపణలు, తాజాగా విద్యుత్ కొనుగోళ్లల్లో అక్రమాల కేసు.. వీటిల్లో ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైనే ఆరోపణలు. ఈ కేసుల్లో ఇప్పటికే ఆ నేతలు విచారణకు కూడా హాజరయ్యారు. ఇక ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ కూడా అనుమతిచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలకు మరో కొత్త తలనొప్పి మొదలైంది.
Also Read : ఈషా వేదికగా.. రాజ్ సమంత వివాహం?
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత తీరు ఇప్పుడు ఆ పార్టీ నతేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్నటి వరకు కవితను ఆ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ ఇటీవల జన జాగృతి పేరుతో కవిత తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కట్టుబొట్టు మార్చేశారు. టార్గెట్ గులాబీ అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా హరీష్ రావును కవిత టార్గెట్ చేశారు. సొంత పార్టీలో అగ్రనేతల పైనే కవిత ఆరోపణలు చేయడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇన్ని రోజులు కేసీఆర్ కుమార్తె అని సైలెంట్‌గా ఊరుకున్నారు. పైగా కొంతమంది నేతలైతే.. మన దాకా రాలేదు కదా అని సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇటీవల జిల్లాల పర్యటనలో మాజీ మంత్రులపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Also Read : ట్రాఫిక్ కష్టాలకు జీహెచ్ఎంసీ ప్లాన్ అదుర్స్
జన జాగృతి పేరుతో కవిత చేస్తున్న పర్యటనలు, చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్‌కు నష్టం కలిగిస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో కవిత పట్ల ప్రజల్లో సానుభూతి కూడా పెరుగుతోంది. కవితను సొంత అన్న, బావ తరిమేశారని.. కన్న తండ్రి కూడా కవితను పట్టించుకోవటం లేదనే మాట ప్రజల్లో బాగా వినిపిస్తోంది. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి. ఇలాంటి సమయంలో సైలెంట్‌గా ఉంటే.. ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలవాలనేది గులాబీ బాస్ టార్గెట్. కానీ.. కాంగ్రెస్ కంటే కూడా కవిత తీరు.. కారు టైర్ పంచర్ చేసేలా ఉందని కలవరపడుతున్నారు. అందుకే ఇకపై కవిత చేస్తున్న ఆరోపణలకు ప్రతి ఒక్కరు ధీటుగా జవాబివ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా నేతలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇకపై కవిత తమ పార్టీపైన, కేసీఆర్ పాలనపైన ఆరోపణలు చేస్తే.. వెంటనే.. అధికారంలో ఉన్న పదేళ్లు ఎందుకు మాట్లాడలేదని నిలదీయాలని సూచించారు. కవిత తీరుకు బ్రేకు వేయాలని గులాబీ పార్టీ నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

