కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాములా మారుతుందనేది సామెత. ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొలి నుంచి వైసీపీ నేతలకు ఓ విషయం కొరకరాని కొయ్యగా మారింది. అదే న్యాయస్థానం. జిల్లా కోర్టు మొదలు.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వరకు వైసీపీ నేతలకు అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలకు మొట్టికాయలే పడ్డాయి.
న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపించడంలో వైసీపీ విఫలమవుతుందా..? అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ఆ పార్టీ చేస్తున్న న్యాయపోరాటాల్లో ఎక్కువగా వ్యతిరేక తీర్పులే వస్తుండటం ఈ చర్చకు కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరుసగా కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు తింటున్నా, వైసీపీ అధిష్టానం సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఉదాహరిస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలను కూటమి ప్రభుత్వం నిలిపి వేసిందంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేయడంతో పాటు, ఏవైనా ఇబ్బందులు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read : రుషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏమిటీ సార్..?
సోషల్ మీడియా అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సస్పెండ్ చేయించిందనే వైసీపీ వాదనలను వినేందుకు కూడా సుప్రీంకోర్టు ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ తొందరపడిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా స్థానిక కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు మెట్లెక్కడం వల్లే ఇటువంటి తీర్పు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టులో న్యాయం దక్కనప్పుడు సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తే బాగుండేదని, కానీ నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ప్రయోజనం దక్కలేదని అంటున్నారు. దీనివల్ల సమయం వృధా అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో వైసీపీ చేస్తున్న న్యాయపోరాటాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఆ పార్టీ లీగల్ టీమ్ మరింత పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడం సహజమైపోయిందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసిన కేసు ఒక ఎత్తు అయితే, ఇటీవల వైసీపీ ఉధృతంగా పోరాడిన డీఎస్పీపైనా న్యాయస్థానంలో చతికిలపడిందని గుర్తు చేస్తున్నారు.
రెండేళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వైసీపీ వేసిన పలు పిటిషన్లకు వ్యతిరేకంగా తీర్పులు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలను వైసీపీ అధిష్టానం విశ్లేషించుకోవాల్సి ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసిన సమయంలో పార్టీ లీగల్ టీమ్ ఒకటికి రెండు సార్లు సరి చూసుకుంటే ఇలాంటి ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు ఉండవని అంటున్నారు. మరో వైపు తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో వైసీపీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇందుకు కొంత సమయాభావం అయ్యే పరిస్థితి కనిపిస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : భారత్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..!
నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే కోర్టు తీర్పులు వస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ వైసీపీ విషయంలో మాత్రం.. చాలా విషయాలకు కోర్టులు బ్రేకులు వేశాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల నిర్ణయానికి తొలుత బ్రేకులు పడింది న్యాయస్థానంలోనే. అలాగే డీజీపీ, సీఎస్ సహా ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులతో పాటు కోర్డు ధిక్కారణ వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. వీటన్నిటికి ప్రధాన కారణం.. వైసీపీ లీగల్ టీమ్ ఘోర వైఫల్యం అంటున్నారు వైసీపీ నేతలు.

