వ్యాపార పరంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిలో ప్రయాణించే భారత్, పాకిస్తాన్‌కు చెందిన నౌకలపై ఇరాన్ ప్రభుత్వం సంచలన నిషేధాన్ని విధించింది. ఇరాన్ నిర్దేశించిన నిబంధనలు, రవాణా ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 45 నౌకలను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్లు పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ ప్రకటించింది. ఈ నిషేధిత జాబితాలో భారత్ కు చెందిన ‘మహా రూస్’ అనే భారీ సరుకు రవాణా నౌకతో పాటు పాకిస్తాన్‌కు చెందిన ‘మర్దాన్’ అనే క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ కూడా ఉన్నాయి.
Also Read : వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య పోరు..!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నడిచే ఈ వ్యూహాత్మక జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ సొంతంగా సరికొత్త రూట్లను ప్రవేశపెట్టింది. అయితే ఇరాన్ ఆమోదించిన మార్గంలో కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా మద్దతు ఉన్న రూట్లలో ప్రయాణించిన నౌకలనే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఈ 45 నౌకలలో దాదాపు మూడో వంతు ఇప్పటికే సముద్రంలో దాడులకు గురై దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నౌకాయాన సంస్థ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
Also Read : ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం..!
ప్రస్తుతం నిషేధానికి గురైన నౌకలలో అత్యధికం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థలకు చెందినవి కాగా.. ఖతార్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల నౌకలు కూడా ఉన్నాయి. ఈ నౌకలు భవిష్యత్తులో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తే భారీ జరిమానాలు, నౌకల జప్తు లేదా స్వాధీనం వంటి కఠిన చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఈ నిషేధం వల్ల భారతదేశానికి వచ్చే చమురు, ఇంధన రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

