భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన జపనీస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హోండా ఎలివేట్ తన సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌తో అలరించడానికి సిద్ధమైంది. హోండా కార్స్ ఇండియా సంస్థ అక్టోబర్ 6వ తేదీన హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత వస్తున్న మొదటి మేజర్ అప్‌డేట్ ఇదే కావడం విశేషం. ఈ కొత్త మోడల్ కోసం ఆసక్తి గల కొనుగోలుదారులు టోకెన్ అమౌంట్ రూ. 21,000 చెల్లించి అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
Also Read : గవర్నర్ కోటా పైనే హస్తం కన్ను..!
టీజర్ వీడియోల ఆధారంగా ఈ హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో పలు ఆకర్షణీయమైన మార్పులు చేశారు. విమాన తరహా గ్రిల్ డిజైన్, సరికొత్త బంపర్, సరికొత్త ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు దీనికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటివరకు గ్రిల్‌పై ఉన్న హోండా అధికారిక లోగోను ఇప్పుడు నేరుగా బోనెట్ పైకి మార్చారు. వెనుక భాగంలో సరికొత్తగా కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు రీడిజైన్ చేసిన బంపర్‌ను జత చేశారు. అయినప్పటికీ, దీని సిగ్నేచర్ అప్‌రైట్ స్టాన్స్ మరియు 17-ఇంచుల అలాయ్ వీల్స్ డిజైన్ మునుపటి లాగే కొనసాగుతున్నాయి.
క్యాబిన్ లోపల ప్రయాణికులకు మరింత లగ్జరీ ఫీలింగ్ ఇచ్చేలా ఇంటీరియర్‌ను సరికొత్త లైట్ థీమ్‌తో డిజైన్ చేశారు. సాంకేతికంగా కూడా ఈ కారును మరింత పటిష్టం చేస్తూ.. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యాష్‌బోర్డ్ చుట్టూ అంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, భద్రతను పెంచేలా సరికొత్త 360-డిగ్రీల కెమెరా సెటప్ మరియు మెరుగైన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లను జోడించినట్లు తెలుస్తోంది. మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగిస్తున్నారు.
Also Read : అంబటి ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!
ఇది 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, మరియు టాటా కర్వ్ వంటి గట్టి మోడళ్లతో నేరుగా పోటీ పడనుంది. ధరల విషయానికి వస్తే బేస్ వేరియంట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, టాప్ వేరియంట్ల ధరలు మాత్రం ఫీచర్ల అప్‌గ్రేడ్ వల్ల స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


