దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వివాదం మరోసారి ఆసక్తిగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తేదీన కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణించిన సమయంలో, ఆయన సేవలకు గౌరవార్థంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : అలెర్ట్.. ప్రపంచానికి పొంచి ఉన్న భారీ ముప్పు..!
ఇందులో భాగంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద పోలీసులు తుపాకులతో గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలు తమకు అవసరం లేదని చెబుతూ, విధుల్లో ఉన్న ఏఆర్ ఎస్సై, ఇతర కానిస్టేబుళ్లను పక్కకు నెట్టివేస్తూ తోపులాటకు దిగారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే పోలీసుల విధులకు తీవ్ర ఆటంకం కలిగించి, అక్కడ హంగామా సృష్టించారని బాధితులు ఆరోపించారు.
Also Read : బొత్సను ఒంటరిని చేస్తున్న మేనల్లుడు..!
పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై తోపులాటకు దిగిన వ్యవహారంపై ఏఆర్ ఎస్సై వెలుదూటి అప్పలరాజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 132, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ముద్రగడ బతికున్నప్పుడు ఎన్నో అవమానాలకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే గౌరవాలు తమకు వద్దని ముద్రగడ కుటుంబ సభ్యులు ముందే చెప్పారని, తాము కేవలం ముద్రగడ చివరి కోరికను మాత్రమే అమలు చేశామని అంబటి రాంబాబు గతంలో సమర్థించుకున్నారు.


