జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి నిరసనల విజయం తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విద్యార్థి ఉద్యమం అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకుడు అబిజిత్ దిప్కే ప్రస్తుతానికి తాము రాజకీయ పార్టీగా మారేది లేదని, ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించినప్పటికీ, విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలను భిన్నంగా చూస్తున్నారు.
Also Read : కాపులను రెచ్చగొడుతున్న వైసీపీ.. వర్కవుట్ అవుతుందా..?
భవిష్యత్తులో సీజేపి ఒక పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా అవతరిస్తే, దాని ప్రభావం అధికార బీజేపీ కంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రంగా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, సీజేపి ఎన్నికల బరిలోకి దిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు పెద్ద గండి పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అధికార బీజేపీకి ఒక స్థిరమైన సిద్ధాంతం, చెక్కుచెదరని సొంత ఓటర్ల బేస్ ఉంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నమ్ముకున్న నిరుద్యోగం, అవినీతి విద్యా వ్యవస్థ, యువత సమస్యల వంటి అంశాలనే సీజేపి కూడా బలంగా లేవనెత్తుతోంది.
ఒకే విధమైన ఆలోచనను రెండు పార్టీలు పంచుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతిపక్షాల స్పేస్ మరింత తగ్గి, అంతిమంగా అది అధికార పార్టీకే లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయకంగా ఆకర్షించే యువ ఓటర్లను సీజేపి తనవైపు తిప్పుకుంటే హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఈ ముప్పును ముందే పసిగట్టిన కాంగ్రెస్ శ్రేణులు, ఆరంభంలో ఈ విద్యార్థి నిరసనలకు కొంత దూరంగానే ఉన్నాయి.
Also Read : మరో మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్దం..?
అయితే, ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా జంతర్ మంతర్ వద్దకు వెళ్లడం, అటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం వెలుపల ప్రత్యేక నిరసన చేపట్టి లైమ్ లైట్ లోకి రావడం జరిగాయి. ఈ ఉద్యమం పూర్తిగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్తే మరింత రాజకీయ ఇబ్బందులు వస్తాయని భావించే కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి, ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవడానికి అంగీకరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా, రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ సరికొత్త యూత్ ఫోర్స్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

