ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలకమైన ముందడుగు వేసింది. స్థానిక పోరులో పోటీపడుతున్న అభ్యర్థుల పూర్తి వివరాలు, వారి నామినేషన్ పత్రాలు మరియు విద్యార్హతలు, ఆస్తులు, క్రిమినల్ రికార్డులతో కూడిన అఫిడవిట్లను డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఎన్నికల్లో ఓటర్లు తమ నాయకుడి గురించి తెలుసుకునే ప్రాథమిక హక్కును పరిరక్షించడమే లక్ష్యంగా ఎస్‌ఈసీ ఈ చర్యలు చేపట్టింది.
Also Read : ఏపీకి మరో ముప్పు.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక..!
ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఒక క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాల వారీగా, స్థానిక సంస్థల వారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులందరి పత్రాలను వెంట వెంటనే స్కాన్ చేసి, అప్‌లోడ్ చేయాలని క్షేత్రస్థాయి రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలో పేర్కొంది. దీనివల్ల ఓటర్లు పోలింగ్ తేదీకి ముందే తమ వార్డు లేదా డివిజన్ నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల నేపథ్యాన్ని, వారు దాఖలు చేసిన వివరాలను సులభంగా పరిశీలించే వెసులుబాటు లభిస్తుంది.
Also Read : కష్టకాలంలో ఏపీకి అండగా తెలంగాణ, తమిళనాడు సీఎంలు..!
నామినేషన్ ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా చేయడమే కాకుండా, అభ్యర్థుల వివరాలను దాచే ప్రయత్నాలకు ఈ డిజిటల్ విధానం చెక్ పెడుతుందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, దీనిపై నివేదిక కోరింది. న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనాన్ని, విశ్వసనీయతను మరింత పెంచుతుందని నిపుణులు కొనియాడుతున్నారు.


