కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తోంది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది. వీటితో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన కింద కూడా భారీగా నిధులు మంజూరు చేస్తోంది. వీటితో పాటు రవాణా రంగం అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోంది. ఏపీ సర్కార్ అడిగిన వెంటనే పెద్ద ప్రాజెక్టులను కూడా కేంద్రం మంజూరు చేస్తోంది.
Also Read : వారి మెడకే చుట్టుకున్న యవ్వారం..!
తాజాగా ఏపీ మీదుగా 3 బుల్లెట్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది. అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్, కర్నూలు, అనంతపురం మీదుగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్, తిరుపతి చిత్తూరు మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్ నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్లో ప్రకటించారు. వీటి డీపీఆర్‌లను ఇప్పటికే రైల్వే శాఖ సిద్ధం చేసింది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ఈ మూడు మార్గాలు రాయలసీమ, దక్షిణ కోస్తా మార్గాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
వీటితో పాటు తాజాగా విజయవాడ – విశాఖ మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించింది. దీని కోసం ఫైనల్ సర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే.. గరిష్ఠ వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ మార్గంలో ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలు ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం కూడా ప్రతిపాదించారు.
Also Read : డేటాతో చేసిన దాడి: ఖచ్చితత్వంతో ఖమేనీ అంతం!
విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం విజయవాడా నుంచి కర్నూలు మధ్య నేరుగా రైళ్లు లేవు. డోన్ లేదా నంద్యాల రైల్వేస్టేషన్లో రైలు మారాల్సి ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ ప్రతిపాదన ప్రకారం గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మార్గం ద్వారా మొత్తం 350 కిలోమీటర్ల దూరం కొత్త సెమీ హైస్పీడ్ లైన్ నిర్మిస్తారు. ఈ మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే రెండు టన్నెల్స్ నిర్మించారు. ఈ మార్గంలో రైళ్లు గరిష్ఠంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. భవిష్యత్‌లో ఇది అందుబాటులోకి వస్తే.. విజయవాడ-కర్నూలు ప్రయాణ సమయం రెండు గంటల వరకు తగ్గుతుంది. రైల్వే బోర్డు నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మామ పనులు ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణంతో రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ మరింత వేగవంతమవుతుంది. భవిష్యత్తులో ప్రయాణ సమయం తగ్గడం, నగరాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి దోహదం అవుతుంది.

