తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా సంచలనం రేపిన అంశం అన్నామలై రాజీనామా. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై.. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తక్కువ సమయంలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి ఎదిగారు. అనూహ్యంగా ఎన్నికల ముందు అన్నామలైను తప్పించడంతో ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే బీజేపీ గెలిచింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అన్నామలై.. బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. 5 పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖతో బీజేపీ పెద్దల తీరును ఎండగట్టారు కూడా.
Also Read : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..!
అన్నామలై రాజీనామా తర్వాత తమిళ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అన్నామలై మాత్రం.. పార్టీ ప్రారంభానికి ఇంకా సమయం ఉందన్నారు. అదే సమయంలో “వి ద లీడర్స్” పేరుతో ఓ ఉద్యమం ప్రారంభించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే ఈ ఉద్యమం అని ప్రకటించారు. అయితే తాజాగా మరో కీలక ప్రకటన చేశారు అన్నామలై. తమ పేరుతో కొందరు నిధులు సేకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అన్నామలై.. సోషల్ మీడియా ద్వారా రెండు పేజీల లేఖ విడుదల చేశారు.
Also Read : టీడీపీలో రాజ్యసభ రచ్చ..!
“తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావాలనే గొప్ప లక్ష్యంతో ప్రారంభమైన మన ‘వి ద లీడర్స్’ ఉద్యమం, మీ అందరి ప్రేమ, మద్దతుతో, ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే 17 లక్షల మంది సభ్యులకు చేరువవుతోంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఒక చిన్న ఆరంభం మాత్రమే. మనమందరం కలిసి తమిళనాడులో తప్పకుండా రాజకీయ మార్పు తీసుకువస్తాము. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుత వాతావరణంలో, నాతో సహా ప్రతి ఒక్కరూ ఈ గొప్ప ఉద్యమంలో ఒక భాగం మాత్రమే, ఎవరికీ ఎలాంటి బాధ్యతలు గానీ, పదవులు గానీ అప్పగించలేదు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, త్వరలో వారి బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నేను ముందే చెప్పినట్లుగా, మన ఉద్యమంలో శాశ్వత పదవులు ఉండవు. ఈ ఒక నెల కాలం కేవలం సభ్యుల నియామకానికి మాత్రమే కేటాయించబడుతుంది.
ఈ నేపథ్యంలో, కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు ఏకమై, నా పేరు, ఫోటో వాడుకుంటూ కొన్ని ఉద్యమాలను ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా, ఆ ఉద్యమాలలో జిల్లా వారీ బాధ్యతలను కూడా ప్రకటించినట్లు తెలిసింది. ఇది అధికారిక ప్రక్రియ కాదని, ఆ ఉద్యమాలకు మన ‘వి ద లీడర్స్’ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేదని మీకు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన మన ప్రయత్నాలు, కొద్దిమంది చేసే ఇలాంటి చర్యల వల్ల నీరుగారిపోతాయి. అన్నామలై అన్బు కూట్టం, అన్నామలై నర్పణి మండ్రం పేరుతో నా పేరును వాడుకుంటూ కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థలకు, ఇకపై నా పేరును ఉపయోగించవద్దని కోరుతూ మేము కొన్ని నెలల క్రితమే ఒక లేఖ రాశాము. అయినప్పటికీ, ఆ సంస్థలు అటువంటి కార్యకలాపాలను కొనసాగించడం విచారకరం.
Also Read : సామాన్యుడి కోరిక తీర్చనున్న సీఎం..!
అందువల్ల, అన్నామలై అన్బు కూట్టం, అన్నామలై ఛారిటబుల్ ఫౌండేషన్, అన్నామలై పీపుల్స్ మూవ్‌మెంట్ వంటి నా పేరును ఉపయోగించే వివిధ సంస్థలు, నా పేరును గానీ, ఫోటోలు గానీ ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని నేను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. మన ఉద్యమంలో చేరాలనుకుంటున్న సోదర సోదరీమణులారా “wetheleader.org” వెబ్‌సైట్ ద్వారా మాతో చేరవలసిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను.” అంటూ తన లేఖలో స్పష్టం చేశారు.
తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని.. ఎవరికీ ఎలాంటి పదవులు లేవని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో తను చేస్తున్న ఉద్యమంలో శాశ్వత పదవులు ఉండవని చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను కూడా ఉద్యమంలో ఒక భాగమే అని అన్నామలై చేసిన ప్రకటనతో వి ద లీడర్స్ ఉద్యమం వైపు యువత భారీగా మొగ్గు చూపుతోంది.

