ఏపీలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీల వ్యవహారం ఒక విధంగా ఉంటే.. ఆ పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు మరో విధంగా ఉంది. ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్షం హోదా కోసం తాపత్రయ పడుతున్న వైసీపీలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విచిత్రంగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన ఉదాహరణ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని దగ్గరగా గమనిస్తే.. అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే ప్రశ్న తలెత్తుతుంది కూడా.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదుగా..!
2024 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసిన విరూపాక్షి విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మాత్రమే వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ఒకరు మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, మరొకరు విరూపాక్షి. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. 1987 ఉపఎన్నికలో.. ఆ తర్వాత 1994లో మాత్రమే. ఆ తర్వాత వరసగా 3 సార్లు కాంగ్రెస్, మరో 3 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ వరుస విషయాలు దక్కించుకుంది. రెండుసార్లు గుమ్మునూరు జయరాం గెలిస్తే.. 2024 ఎన్నికల్లో విరూపాక్షి విజయం సాధించారు.
అయితే గత ఎన్నికల్లో 2 వేల 8 వందల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన విరూపాక్షి.. తొలి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. తొలినాళ్లల్లో జగన్ వెంటే ఉన్నట్లు కనిపించినప్పటికీ.. ఇటీవల మాత్రం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఒక్కచోట కూడా విరూపాక్షి కనిపించలేదు. ఇదే సమయంలో కూటమి నాయకులతో బాగా టచ్‌లో ఉన్నారనే వాదన బాగా వినిపిస్తోంది. తాజాగా తన అభిమానులతో సమావేశమైన విరూపాక్షి.. నియోజకవర్గంలో పనులు జరగాలంటే.. తాను ఒంటరిగా ఉండే సాధ్యం కాదని తేల్చేశారు. ఒంటరిగా తాను సాధించేది ఏమీ లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే.
Also Read : గంభీర్ పెత్తనం.. రంగంలోకి బోర్డు..!
నిజానికి ఎవరైనా పార్టీ మారుతున్నారంటే.. దాని వెనుక చాలా కారణాలుంటాయి. ఎవరైనా కేసుల భయంతో, లేకపోతే ఆర్థిక లావాదేవీలు, లేదా బెదిరింపులతో మాత్రమే పార్టీలు మారుతుంటారనేది బహిరంగ రహస్యం. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి కూడా. కానీ ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి విషయంలో మాత్రం.. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిజానికి విరూపాక్షి మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ ఎమ్మెల్యే మాత్రం.. నిత్యం కూటమి నేతలతో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది.
విరూపాక్షికి కూటమి నేతలు కూడా అంతర్గంతగా సహకరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనేది విరూపాక్షి మాట. ప్రజా ప్రయోజనం కోసమే తాను ఇలా చేస్తున్నానన్నారు విరూపాక్షి. దీంతో అసలు ఎమ్మెల్యే విరూపాక్షి మనసులో ఏముందో.. ఆయన చెప్పిన మాటకు అర్థం ఏమిటనేది ఏ మాత్రం అర్థం కాలేదంటున్నారు విరూపాక్షి అభిమానులు.
Also Read : ముచ్చల్‌తో బ్రేకప్.. చివరికి నిజం చెప్పిన స్మృతి
మరోవైపు విరూపాక్షి విషయంలో వైసీపీ అధిష్ఠానం ఏ మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఇది కూడా తమ మంచికే అనేది విరూపాక్షి భావన. కూటమి నేతలో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా సరే.. ఇప్పటి వరకు వైసీపీ పెద్దలు విరూపాక్షిని ఎలాంటి వివరణ కోరలేదు కూడా. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మునూరు జయరాం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆలూరు నియోజకవర్గం కూడా మనదే అంటూ.. జయరాం చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పెద్ద దుమారం రేపాయి. ఒక రకంగా విరూపాక్షి పార్టీ మార్పు ఖాయమని జయరాం చెప్పకనే చెప్పేశారు అంటున్నారు ఆలూరు నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు. ఏది ఏమైనా.. విరూపాక్షి పార్టీ మార్పు.. ఉంటుందా.. ఉండదా అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

