కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలన మరకలు ఇప్పటికీ చెరిగిపోలేదు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దడంతో పాటు ఏపీని తిరిగి ప్రగతి పథంలో నిలుపుతారని చంద్రబాబుపైన రాష్ట్ర ప్రజలు గంపెడాశ పెట్టుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి నిధుల కొరత అతి పెద్ద అడ్డంకిగా మారిందనేది వాస్తవం. ఐదేళ్ల జగన్ పాలనలో దాదాపు రూ.8 లక్షల కోట్లు పైగా అప్పులు చేశారనేది కేంద్ర ప్రభుత్వ మాట. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశాడని తొలి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే ఫోకస్ పెట్టాడని… అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారనే విమర్శలు తొలి నుంచి వినిపిస్తున్నాయి.
దీంతో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యింది. చివరికి జీతాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందనేది వాస్తవం. ప్రతి శుక్రవారం ఇండెంట్ పెట్టడం… మంగళవారం అప్పు తెచ్చుకోవడం… దానిని పంచి పెట్టడం అనేది రొటిన్‌గా జరిగిపోయింది. జగన్ సర్కార్ వేధింపుల కారణంగా ఏపీకి పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో ఆదాయం పూర్తిగా కుంటుపడిపోయింది. జగన్ సర్కార్ లోపాలను ప్రధానంగా ఎత్తిచూపిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే బాధ్యత నాది అని ఎన్నికల్లో భరోసా ఇవ్వడంతో… ఓటర్లు ఏకపక్షంగా ఓట్లు వేశారు. దీంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
Read Also : జగన్ జోస్యం ఫలిస్తుందా..?
అయితే ఇక్కడే చంద్రబాబు సర్కార్‌కు అసలు సిసలు టాస్క్ మొదలైంది. ప్రధానంగా ఏపీలో రహదారుల మరమ్మతుల సమస్య ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏపీలో రహదారుల దుస్థితిపై ప్రత్యక్ష పోరాటాలు చేశారు. గుంతలమయమైన రోడ్ల గురించి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. చివరికి మీడియాలో కూడా రోడ్ల దుస్థితిపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రహదారులను మరమ్మతు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు హామీ నెరవేర్చడం కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.
ఖజానాలో చిల్లిగవ్వ లేదని ఓ వైపు సీఎం చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ సమయంలో రోడ్ల మరమ్మతుకు కనీసం 10 వేల కోట్లు కావాలని అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. చాలా చోట్ల అత్యంత దయనీయంగా రోడ్లు మారిపోయాయి. వీటిని తక్షణమే మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. అయితే వీటికి నిధులను ఎలా సేకరించాలనే అంశంపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షాకాలం ముగియడంతో… జూన్ నెల లోపు రహదారులను మరమ్మతు చేయాలనేది లక్ష్యంగా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది.

