ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కొన్ని చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సైతం తలదన్నేలా అత్యంత ఖరీదుగా మారాయి. ముఖ్యంగా మార్కాపురం జిల్లా, చంద్రశేఖరపురం మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ చిన్న గ్రామంలో ఒక్కో ఓటుకు ఏకంగా రూ.25 వేల వరకు నగదు పంపిణీ జరిగిందన్న ప్రచారం స్థానికంగా, సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతోంది.
Also Read : చెక్ పెడితేనే మేలు.. లేదంటే అంతే సంగతులు..!
అయ్యలూరివారిపల్లి సర్పంచ్ పదవి ఈసారి ఓసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో, ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు రెబల్ అభ్యర్థి కూడా బరిలోకి దిగారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఇక్కడ పోరు తీవ్ర ఉత్కంఠగా మారింది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.25 వేల చొప్పున పంచినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి పోటీగా రంగంలోకి దిగిన ఓ రెబల్ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.20 వేలు అందజేయగా, మరో పార్టీ మద్దతుదారు రూ.15 వేల చొప్పున పంపిణీ చేసినట్లు గ్రామంలో చర్చ నడుస్తోంది.
ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 841 మాత్రమే. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండటంతో ప్రతి ఒక్క ఓటు అత్యంత కీలకంగా మారింది. దీంతో గ్రామంలో ఉంటూ ఓటు వేసే వారికే కాకుండా, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె వంటి ఇతర నగరాలకు వలస వెళ్లిన ఓటర్లను కూడా రప్పించేందుకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేసే వారికి ప్రయాణ ఖర్చుల కింద అదనంగా ఒక్కొక్కరికి రూ.5 వేల వరకు అందజేసినట్లు తెలుస్తోంది.
Also Read : బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేసిన వారణాసి..!
ఒక్కో ఓటుకు వేల రూపాయలు, వలస ఓటర్లకు ప్రత్యేకంగా ప్రయాణ భత్యాలు చెల్లిస్తుండటంతో ఈ చిన్న పంచాయతీ ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయలకు చేరినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ నగదు పంపిణీ ఆరోపణలపై ఎన్నికల అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఏదేమైనా, కేవలం 841 ఓట్లు ఉన్న ఒక చిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో డబ్బు ప్రవాహం కొనసాగడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.


