ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదం చుట్టుముట్టింది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సాండ్‌పేపర్‌గేట్ కుంభకోణం తర్వాత కేవలం ఆరు నెలలకే, ఆసీస్ ఆటగాళ్లు మరోసారి బంతి ఆకారాన్ని మార్చేందుకు కుట్ర పన్నినట్లు తాజా నివేదిక సంచలనం రేపింది. ఆస్ట్రేలియా జర్నలిస్ట్ జెరార్డ్ వాట్లీ నిర్వహించిన పరిశోధన ప్రకారం, 2018 అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పిచ్ నుంచి ఆసీస్ బౌలర్లకు ఎలాంటి సహకారం లభించకపోవడంతో, బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు మింట్స్ వాడాలనే చర్చ జట్టులో జరిగింది.
Also Read : రెచ్చిపోయిన ఉక్రెయిన్.. రష్యా యుద్ధనౌకను పేల్చేసింది..!
‘ఎవరి దగ్గర మింట్స్ ఉన్నాయి..? ఈరోజు బంతిని ఎవరు చూసుకుంటున్నారు?’ అంటూ ఓ ఆటగాడు ప్రతిపాదించగా, మరో ఆటగాడు తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు వెల్లడైంది. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పటి కెప్టెన్ టిమ్ పైన్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ రంగంలోకి దిగి ఆటగాళ్లను మందలించడంతో ఆ ప్రణాళిక అక్కడితో ఆగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు, అంతకుముందు జరిగిన సాండ్‌పేపర్ ఉదంతంలో హోటల్ గదిలో ఆసీస్ ఆటగాళ్ల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం వివరాలు కూడా తాజాగా బయటకు వచ్చాయి.
Also Read : భూమన ఫేక్ ప్రచారానికి ఆధారాలతో దిమ్మతిరిగే కౌంటర్..!
ఆ కుంభకోణంలో కేమరూన్ బాన్‌క్రాఫ్ట్ ఒక్కడినే బలిపశువును చేయడానికి డేవిడ్ వార్నర్ ప్రయత్నించగా, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తీవ్రంగా మండిపడ్డాడట. ‘ఈ విషయంలో నువ్వు తప్పించుకోలేవు, నీ తప్పుకు బాన్‌క్రాఫ్ట్‌ను బలికానివ్వం’ అంటూ వార్నర్‌ను మార్ష్ గట్టిగా నిలదీసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, 2018 సాండ్‌పేపర్ వివాదంలో దోషులుగా తేలిన అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా, కేమరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దుబాయ్ టెస్టులో ‘మింట్స్’ వివాదం బయటకు రావడం క్రికెట్ ఆస్ట్రేలియాను మరోసారి ఇరకాటంలో పడేసింది.


