రంగులు మారుతున్న పంచాయతీ “రాజీ” కియాలు.. అటు మున్సిపల్ ఎన్నికల్లో.. ఇటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో చావు దెబ్బ తిన్న వైసీపీ నాయకులు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారు.. ఇంకా చెప్పాలంటే వణికి పోతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. అందుకనే.. గ్రామాల్లో “రాజీ” కీయం ప్రారంభం అయ్యింది. వైసీపీ నాయకులే కొన్ని “రాజీ” ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటమి పరాభవంతో ఉన్న వైసీపీ నాయకులే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తెల్ల జెండా ఎత్తేశారట. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం కంటే.. ఏదో విధంగా రాజీ చేసుకోవటమే బెటర్ అని భావిస్తున్నారటా.!!
Also Read : సీఐఐ సమ్మిట్‌లో లోకేష్, రానా దగ్గుబాటి ఆసక్తికర సంభాషణ..!
పంచాయతీ ఎన్నికలను వైసీపీ పెద్ద నాయకులు ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవటం లేదు. దీంతో గ్రామ స్థాయి నేతలు కూడా.. ఇప్పుడు పోటీ చేయాలంటే.. ఖర్చు చేయాల్సిందే.. అందుకే.. అనవసరమైన ఖర్చు ఎందుకని భావిస్తున్నారు. అందుకే.. నోటిఫికేషన్‌కు ముందు నుంచే.. టీడీపీ నేతలతో రాజీ పడుతున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం వైసీపీ నేతలు గట్టిగానే ఖర్చు చేశారు. అయినా సరే.. ఫలితం మాత్రం వ్యతిరేకంగానే వచ్చింది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నేతలు.. ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఎన్నికల కోసం ఖర్చు చేయటం అవసరమా.. అనే భావనలో ఉన్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం నేపథ్యంలో వైసీపీ నాయకులలో చాలా మంది నిరాశ పడ్డారనేది వాస్తవం. అధినేత మాట విని పోటీ చేసినప్పటికీ.. గతంలో చేసిన తప్పుల కారణంగా.. ఓటమి ఎదురైంది. దీంతో పోయిన పరువును గ్రామాల్లో అయినా నిలబెట్టుకునేందుకు ఇప్పుడు టీడీపీ నేతలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగితే.. సర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్లుగా కూడా వైసీపీ నేతలు గెలిచే పరిస్థితి లేదు. పైగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటుకు నోటు ఇవ్వాల్సిందే. గ్రామాల్లో అయితే.. కాస్త ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు గ్రామస్తులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే.
Also Read : అసలు మైక్రోసాఫ్ట్ కు ఏమైంది..? ఎందుకింత లేట్..?
అందుకే పోటీ చేసిన అటు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు.. ఇటు గ్రామంలో పరువు పోగొట్టుకోవటం ఎందుకని భావిస్తున్న వైసీపీ గ్రామస్థాయి నేతలు.. టీడీపీ, జనసేన నేతలతో రాజీ చేసుకుంటున్నారు. వార్డు మెంబర్లుగా ఓ రెండు స్థానాలు తమకు కేటాయిస్తే చాలు.. ఏకగ్రీవాలకు అంగీకారం అనే ప్రపోజల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిన్నటి వరకు ఎడమొహం, పెడమొహంగా ఉన్న టీడీపీ, వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజీ చర్చలు జరుపుతున్నారు. సర్పంచ్ పదవులకు పోటీ చేసేది లేదని.. వార్డు మెంబర్ పదవులతో సరిపెట్టుకుంటామనేది వైసీపీ నేతల ప్రతిపాదన. ఈ ప్రతిపాదన వల్ల తమకు కూడా ఆర్థికంగా మేలు జరుగుతుందని భావిస్తున్న టీడీపీ, జనసేన నేతలు.. ఇందుకు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది.


