తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే అనుభవించాల్సిందే. తప్పు చేస్తే.. నరకానికి పోతావనేది పెద్దల మాట. అలాగే… దీని ఫలితం తప్పకుండా ఉంటుందంటారు కూడా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం.. తప్పు చేస్తే.. అందుకు ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఎవరు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పని లేకుండా.. అంతా వెంటవెంటనే జరిగిపోతుంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు, పదవుల్లో ఉన్న వారి సంగతి అయితే.. ఎక్కువ కాలం కూడా వేచి చూడాల్సిన పని లేకుండా.. వెంటనే ఫలితం కనిపిస్తోంది. తాజాగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ.
Also Read : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ స్పీడ్..!
సీతానగరంలో తెరవెనుక అసలు కథేంటి… ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రాజానగరం నియోజకవర్గ రాజకీయాల్లో బత్తుల బలరామకృష్ణ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన బత్తుల కుటుంబం విషయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సీతానగరం మండలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. బత్తుల బలరామకృష్ణ కుటుంబం రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు.
అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతో సంబంధాలు కొనసాగించడమే తమ రాజకీయ బలమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీతానగరం పోరాటాలు అంత త్వరగా మరచిపోతారా?. గతంలో సీతానగరం మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ రహదారులు దెబ్బతినడం, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కోవడం, ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తం కావడం వంటి అంశాలపై గ్రామస్థులు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో ప్రజల తరఫున జరిగిన పోరాటాలను నేటి రాజకీయ పరిణామాలతో పోల్చుతూ బత్తుల అనుచరులు ప్రశ్నలు సంధిస్తున్నారు..అయితే ప్రస్తుతం మండలంలో చోటుచేసుకున్న పరిణామాల వెనుక కొందరి రాజకీయ ప్రచారం, వ్యక్తిగత ప్రభావం పని చేశాయన్న అభిప్రాయాలు బత్తుల వర్గీయుల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ సంభాషణలు, రాజకీయ హామీలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, అవతలి వర్గం వివరణ వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read : బ్రేకింగ్: ఏపీలో మళ్లీ మోగనున్న ఎన్నికల నగారా..?
ప్రస్తుత రాజకీయ పరిణామాలను కొందరు బత్తుల కుటుంబానికి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తుండగా, ఆయన అనుచరులు మాత్రం దీన్ని తాత్కాలిక పరిణామంగానే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన రాజకీయ బలం తగ్గిపోదని, కార్యకర్తలు, అభిమానులే అసలైన బలమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల మధ్య ఉన్న సంబంధాలు, గతంలో చేసిన సేవలు రాజకీయంగా ఎప్పటికీ గుర్తుండి పోతాయని చెబుతున్నారు. మొత్తానికి రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ రాజకీయ ప్రస్థానం మరో మలుపు తిరుగుతుందా? సీతానగరం మండలంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆయనకు కొత్త రాజకీయ సవాలుగా మారతాయా? లేక కార్యకర్తల మద్దతుతో తిరిగి తన రాజకీయ బలాన్ని చాటుకుంటారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ ప్రజల మధ్య సంపాదించుకున్న గుర్తింపు, కార్యకర్తల విశ్వాసమే నాయకుడి అసలైన బలం అన్నది ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.


