అమెరికాలో ఐటీ ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారత సాఫ్ట్వేర్ నిపుణులకు దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు ఇకపై హెచ్-1బీ వీసాలతో పాటు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఐబీఎం అధికారికంగా ప్రకటించింది. లక్షన్నర మందికి పైగా ఉద్యోగులు పనిచేసే ఐబీఎం కన్సల్టింగ్ విభాగం నుండి వచ్చిన ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్కీలలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Also Read : స్థానిక విజయాలతో అహం వద్దు.. మంత్రులకు సీఎం వార్నింగ్..!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీ ఐటీ ఉద్యోగుల నియామకాలపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటమే ఐబీఎం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. గత నెలలోనే మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలకు పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను యూఎస్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ వచ్చేందుకు ఈ సర్టిఫికేషన్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశీలన మరింత పక్కాగా మారుతుండటంతో ఐబీఎం తాజా నిర్ణయానికి మొగ్గు చూపింది.
Also Read : చంద్రబాబు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్ల కలవరం..!
గతంలో ఐబీఎం కన్సల్టింగ్ విభాగం నైపుణ్యాల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులపై ఆధారపడినప్పటికీ, గత కొన్నేళ్లుగా ఆ సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం స్థానికంగానే నిపుణులు అందుబాటులోకి రావడం, క్లయింట్ల అవసరాలు మారడంతో ఈ స్పాన్సర్షిప్లకు స్వస్తి పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభావితమైన విదేశీ ఉద్యోగులు అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం బ్రాంచ్లలో పనిచేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఈ ఏడాది చివరికల్లా కంపెనీని వీడాల్సి వస్తుందని తెలుస్తోంది.


