Wednesday, October 28, 2026 07:50 PM
Wednesday, October 28, 2026 07:50 PM

బాబోయ్.. అక్టోబర్ నెల అంటేనే భయం..!

అక్టోబర్ నెల అంటే చాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వణికిపోతుంది. రైతులు భయపడుతున్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. మా మీద ప్రకృతి పగబట్టిందని ఉత్తరాంధ్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే.. అక్టోబర్ నెలలోనే ఉత్తరాంధ్రపై తుఫాన్‌లు విరుచుకుపడుతున్నాయి. దాదాపు 14 ఏళ్లుగా అక్టోబర్ నెలలోనే వరుస తుఫాన్‌లతో ఉత్తరాంధ్ర విలవిలలాడిపోతోంది. తాజాగా అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో అర్నబ్ తుఫాన్ విరుచుకుపడటంతో.. రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు.

Also Read : రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టైంలో మొబైల్ చార్జింగ్ బంద్..!

2012 నుంచి ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ఉత్తరాంధ్రపై ప్రకృతి విరుచుకుపడుతోంది. అది కూడా సరిగ్గా అక్టోబర్ నెలలోనే వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జూన్ నెల మొదటి, రెండో వారంలోనే నారుమళ్లు వేస్తారు. ఈ పంట అక్టోబర్ మొదటి వారంలో కోతకు వస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే తుఫాన్లు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది.. ఉత్తరాంధ్రపైన విరుచుకుపడుతుంది. దీంతో అన్నదాతలు విలవిలలాడిపోతున్నారు.

Also Read : రూ. 3 వేల కోసం కక్కుర్తి.. టికెట్ వదులుకున్న వైసీపీ అభ్యర్థి..!

2012లో నీలం తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 44 మంది చనిపోయారు. నీలం తుఫాన్ చెన్నై సమీపంలో తీరం దాటినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం నెల్లూరు, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీరం దాటే సమయంలో గంటకు 75 నుండి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఇక 2013లో అయితే.. ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సరిగ్గా అక్టోబర్ 12వ తేదీన పైలిన్ తుఫాన్ ఒడిశాలోని గోపాలపురం వద్ద తీరం దాటింది. పైలిన్ ప్రభావం ఉత్తరాంధ్రపై వారం రోజులు పడింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వారం రోజుల పాటు అంధకారంలో ఉన్నాయి.

Also Read : ఏపీలో ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా..?

మళ్లీ సరిగ్గా ఏడాదికి అంటే 2014 అక్టోబర్ నెల 12వ తేదీని విశాఖ వాసులు ఎప్పటికీ మర్చిపోలేదు. విశాఖ చరిత్రలో అదో కాళ రాత్రి. విశాఖపట్నం వద్ద అత్యంత తీవ్రమైన తుఫానుగా ప్రభావం చూపింది. అక్టోబర్ 8న అల్పపీడనంగా మొదలై.. తీవ్ర తుఫాన్‌గా తీరం దాటింది. అదే హుద్ హుద్. గంటకు సుమారు 175 – 215 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. విశాఖ నగరం వణికిపోయింది. అయితే ఈ పరిస్థితి ముందుగానే అంచనా వేసిన నాటి ఏపీ ప్రభుత్వం.. సుమారు 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. తుఫాన్ కారణంగా ముగ్గురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కానీ ఆస్తినష్టం మాత్రం వేలకోట్లలో ఉన్నట్లు తెలిపారు. కేంద్రం కూడా తన వంతు సాయం అందించింది.

ఇక 2015 ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, వాయుగుండంగా మారి నవంబర్ 9న పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదలు అత్యంత తీవ్రమైన విపత్తుగా నిలిచాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాల వల్ల చెరువులు తెగిపోయి, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నీటిపాలైంది. 2016లో వచ్చిన వర్దా తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఇక 2018 అక్టోబర్ 11న వచ్చిన తిత్లీ తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్రమైన తుఫాన్. ఒడిశాలోని గోపాల్‌పూర్ – ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం మధ్య తీరాన్ని దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలు ఈ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయాయి. 2019 మే నెలలో ఫణి తుఫాన్ ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటినప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. 2020 నవంబర్ నెలలో వచ్చిన నివార్ తుఫాన్.. పుదుచ్చేరి వద్ద తీరం దాటినప్పటికీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడపలపై తీవ్ర ప్రభావం చూపింది.

2021 సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో వచ్చిన గులాబ్ తుఫాన్ కళింగపట్నం వద్ద తీరం దాటింది. ఇది ఉత్తరాంధ్రలో భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. 2023 డిసెంబర్ నెలలో వచ్చిన మిచౌంగ్ తుఫాన్.. బాపట్ల వద్ద తీరం దాటింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసి, నగరాలు జలమయమయ్యాయి. వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. తాజాగా అర్నబ్ తుఫాన్ కూడా యానాం – నర్సాపురం మధ్య తీరం దాటింది. గంటకు సుమారు 135 నుండి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అతి తీవ్ర తుఫానుగా ఉత్తర కోస్తాంధ్రను వణికించింది. దీంతో అక్టోబర్ నెల అంటేనే ఏపీ ప్రజలు వణికిపోతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇంకా ఎంత కాలం...

మళ్లీ మళ్లీ అదే ఏడుపు.. ఇది...

రూ. 3 వేల...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల...

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

పోల్స్